సోషల్ మీడియాలో ఎంతో చలాకీగా కనిపించే వైష్ణవి.. అకస్మాత్తుగా భర్త చేతిలో హత్యకు గురైందనే విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఆమె చేసిన రీల్స్‌లో ఇద్దరూ చాలా అన్యోన్యంగా కనిపించేవారని, కానీ ఆమె ఇలా హత్యకు గురవ్వుతుందని అనుకోలేదంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వైష్ణవి హత్య ఘటనతో రీల్ లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరనే విషయం స్పష్టమైంది. ఈ ఘటన తర్వాత వైష్ణవి కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు, అన్నలు ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రతీకారం కోసం ఎదురు చూశారు. చివరికి.. అదనుచూసి.. ఆమెను హత్య చేసిన భర్త హరిబాబును గురువారం దారుణంగా నరికి చంపారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకో తెలియాలంటే.. వైష్ణవి హత్య రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి.
వైష్ణవి తన భర్తతో కలిసి జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలోని అత్తింట్లో ఉండేది. అయితే, మార్చి 16 రాత్రి హరిబాబు, వైష్ణవిల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. అదనంగా రూ.5 లక్షలు కట్నం కావాలని హరిబాబు వేధించినట్లు సమాచారం. 4 నెలల గర్భంతో ఉన్న వైష్ణవి తర్వాతి రోజు కత్తిపోట్లతో శవమై కనిపించింది. ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదంలో విచక్షణ కోల్పోయిన హరిబాబు.. వైష్ణవి గొంతునులిమి ఊరిపిరాడకుండా చేశాడు. తర్వాత పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో.. నురుదు చేతులపై కూడా కత్తితో పొడించాడు. విపరీతమైన రక్తస్రావం కావడంతో వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది.
వైష్ణవి హత్య కేసులో భర్త హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైల్లో 4 నెలలుపాటు ఉన్న తర్వాత జులై నెలలో కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హరిబాబు నిజామాబాద్‌లోని రాజ రాజేంద్ర చౌరస్తా వద్ద మొక్క జొన్న పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన చెల్లిని చంపిన హంతకుడు ఇలా స్వేచ్ఛగా తిరగడాన్ని వైష్ణవి అన్న తట్టుకోలేకపోయాడు. కొద్ది రోజులుగా హరిబాబును ఫాలో అవుతున్నాడు. అదను చూసుకొని గురువారం (సెప్టెంబర్ 17న) పట్టపగలు.. నడిరోడ్డుపై కత్తితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు.
ఇది వేరే పగలతో జరిగిన హత్య ఘటన అయితే జనాలు పెద్దగా స్పందించేవారు కాదు. హరిబాబు చంపింది గర్భంతో ఉన్న భార్యను అందుకే ఈ ఘటన చర్చనీయం అవుతోంది. హరిబాబు హత్యపై సోషల్ మీడియాలో జనాలు భిన్నంగా స్పందిస్తున్నారు. తన చెల్లిని అంత దారుణంగా హత్య చేసిన వ్యక్తి శిక్ష అనుభవించకుండా అలా స్వేచ్ఛ తిరగుతుంటే ఏ అన్న సహిస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నాలుగు నెలల గర్భిణీని హత్య చేసిన వ్యక్తికి అంత త్వరగా బెయిల్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. చట్టాలు త్వరితగతిన శిక్షలు ఖరారు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రతీకార హత్యలు జరుగుతున్నాయని అంటున్నారు.
కొందరు మాత్రం.. సంతోష్ ఇలా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వాదిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే చట్టాలు, కోర్టులు, పోలీసులు ఉండి ఏం లాభమని అంటున్నారు. న్యాయం ఆలస్యమైనప్పుడు ఇలాంటి ఘటనలే చూడాల్సి వస్తుందని పలువురు మన న్యాయవ్యవస్థను తప్పుబడుతున్నారు. వైష్ణవి హత్యకు న్యాయం స్థానం శిక్ష ఖరారు చేసి ఉంటే.. హరిబాబు జైల్లో ఉండేవాడని, సంతోష్ తన కుటుంబంతో కలిసి ఉండేవాడని.. ఈ హత్య అనేదే జరిగి ఉండకపోయేదని జనం అంటున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు?