Begumbazar Ganesh Idol: బేగంబజార్ లో ప్రతిష్టించిన లీ ఛీ కా రాజా గణేశ్ విగ్రహాన్ని విలువైన పంచలోహాలు, 24 క్యారట్ల బంగారం పూత, రూ.3.83 లక్షల అమెరికన్ డైమండ్లతో రూపొందించారన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని గోషామహల్ పోలీసులు స్పష్టం చేశారు. లీ ఛీ కా రాజా గణేశ్ ఉత్సవ కమిటీకి చెందిన కొందరు సభ్యులు, నిర్వాహకులు తమ సొంత వ్యాపార సంస్థ లీ ఛీ పెరల్స్, జువెల్స్ కు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి ఈ ప్రచారానికి తెరతీరని పేర్కొన్నారు. వ్యాపార ప్రయోజనాలు పొందటానికే ఇలా చేశారని స్పష్టం చేశారు.
గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన లీ ఛీ కా రాజా గణేష్ విగ్రహం గురించి కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు, ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ గణేష్ విగ్రహాన్ని సుమారు 48 కిలోల పంచలోహాలతో తయారు చేశారని, దానిపై 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత పూశారని, రూ.3,83,800 అమెరికన్ డైమండ్లను పొదిగారని పలువురు ప్రచారం చేశారు. ప్రత్యేకించి 24 క్యారెట్ల బంగారు పూత అన్న అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రచారం చేయటంతో ఈ విగ్రహం రూ.కోట్లు విలువ చేస్తుందని జనం భావిస్తూ వచ్చారు.
Also Read: బీసీ కుల గణనపై కేంద్రం కుట్ర.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
ఈ క్రమంలో గణేశుడ్ని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం మెుదలైంది. దీంతో రంగంలోకి దిగిన గోషామహల్ పోలీసులు దీనిపై విచారణ జరిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని తేలింది. ఈ గణేష్ విగ్రహాన్ని ప్రచారంలో పేర్కొన్నట్టుగా ఎలాంటి విలువైన లోహాలు, బంగారం పూతతో తయారు చేయలేదని పోలీసులు కనుగొన్నారు. విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూత పూశారనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. ఉత్సవ నిర్వాహకులు వ్యాపార ప్రయోజనాల కోసమే అసత్యాలను ప్రచారం చేశారని వెల్లడైంది.
Also Read: ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!