Danam Nagender: హైదరాబాద్ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే, తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కోర్టు తీర్పుపై సానుకూల స్పందన
ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన దానం, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉపఎన్నిక వస్తే మళ్లీ పోటీకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పోరాడి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్తేమీ కాదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని ఆయన సంకేతాలిచ్చారు.
కార్యకర్తలతో భేటీ.. సమర శంఖారావం!
ఉపఎన్నిక అనివార్యమైతే ఇప్పటి నుంచే సమరానికి సన్నద్ధం కావాలని దానం భావిస్తున్నారు. నియోజకవర్గంలో మళ్లీ తన పట్టు నిరూపించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఖైరతాబాద్‌లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దానం నాగేందర్ వ్యాఖ్యలతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తుందా? వస్తే ఎలాంటి పోరు ఉండబోతోంది? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: దుగ్గొండిలో దారుణం.. పంట దోచేశారని వెళ్తే.. పొలం నీదేనా? అని ఎస్ఐ దబాయింపు!