Godavari Pushkaralu: స్వేచ్ఛ బ్యూరో: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలోనే నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళ్లాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు ఈసారి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు..
అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల సన్నద్ధత, ప్రముఖ దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించారు.
శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పుష్కర ఏర్పాట్లలో సమన్వయ లోపం తలెత్తకుండా జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అదనపు ఏర్పాట్లపై ఘాట్ల వారీగా ప్రత్యేకంగా కలెక్టర్లతో క్షేత్రస్థాయి అధ్యయనం చేయించామన్నారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తయ్యే అవకాశమున్న పనులకే తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. చివరి వరకూ వేచి చూడకుండా గ్రౌండ్ రియాల్టీకి అనుగుణంగా ప్రతి పనికి ఒక నిర్దేశిత గడువును విధించుకోవాలని ఆదేశించారు.
అధికారులకు శ్రీధర్ బాబు ఆదేశాలు..
ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను వెంటనే అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ఇంజినీర్ల కొరత తలెత్తకుండా ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలన్నారు. పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. భద్రాచలం వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఎన్ని నిధులనైనా కేటాయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, పుష్కర ఏర్పాట్లు, పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని తేల్చి చెప్పారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 1,568 బస్సులు
గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 1,568 బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ బస్సులు రోజుకు సుమారు 6,740 రౌండ్ ట్రిప్పులు నిర్వహించనున్నాయని, సుమారు 4,74,293 మంది భక్తులను బస్సుల ద్వారా తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నామన్నారు. పుష్కరాల సమయంలో ప్రత్యేక సేవల నిర్వహణ కోసం సుమారు 35 డిపోలను వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..
రద్దీకి అనుగుణంగా ముఖ్యమైన పుష్కర ఘాట్ల వద్ద తాత్కాలిక బస్ టెర్మినల్స్, బస్ పాయింట్లు, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పొచంపాడు, కందకుర్తి, దోంచండ, తడిబొల్లి, కాళేశ్వరం తదితర ముఖ్య ఘాట్ల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నారు. సుమారు రూ.7.60 కోట్లు అంచనా వేశారు.బస్సుల నిర్వహణ, ప్రయాణికుల రద్దీ నియంత్రణ, ప్రత్యేక బస్ పాయింట్ల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించనున్నారు.14 బస్ స్టేషన్ల ఆధునీకరణ , అభివృద్ధి ప్రతిపాదించగా, ఇందుకు సుమారు రూ.130 కోట్ల వ్యయం అంచనా వేశాసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే ఆర్టీసీ కార్యాచరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యంఅని వెల్లడించారు.
Also Read: నా భూమిలో చిన్న తప్పున్నా 13 ఎకరాలు రాసిచ్చేస్తా! సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్