రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ మరోసారి బయట పడిందని ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఇటీవల నైనీ బొగ్గు బ్లాకుల అవినీతిపై ఇరు పార్టీలు చేసిన విమర్శలు, సంధించిన ప్రశ్నలు ఒకేలా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులు సైతం అదే నిజమని అంటున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పేరుమోసిన పత్రికలో ఓ నైనీ బొగ్గు బ్లాకుల టెండర్లలో కుంభకోణం జరిగిందని కథనం ప్రచురితమైంది. దానిని ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా.. విచారణకు డిమాండ్ చేయకుండా నేరుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడమే ఇందుకు కారణం.
ఇదే విషయంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..నైనీ బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో ఎలాంటి కుంభకోణం జరగలేదని.. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన వివరించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని ఆ టెండర్లను సైతం రద్దు చేశారు.అయితే, మంత్రుల మధ్య టెండర్ల విషయంలో పంచాయితీ నెలకొందని.. సీఎం బావమరిది సుజన్ రెడ్డి ఈ స్కాంకు ఆద్యుడు అని హరీశ్ రావు ప్రధానంగా ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి.. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కేవలం ఒక నైనీ టెండర్ల మీద కాదని.. 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్ల మీద సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి స్పందన కరువైంది. అంతకుముందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విచారణ కోరుతూ హరీవ్ రాసిన లేఖపైనా డిప్యూటీ సీఎం స్పందించారు. కుంభకోణం సింగరేణిలో జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరకుండా.. కేంద్రబొగ్గుగనుల శాఖమంత్రికి లేఖ ఎందుకు రాయడం? మీకు ఏంటిసంబంధం అని ప్రశ్నించారు. కథనం ఓ పత్రికలో వస్తే.. దాని ఆధారంగా హరీశ్ రావు కిషన్ రెడ్డికి విచారణ కోరుతూ లేఖ రాశారంటే వీరిమధ్య తెరవెనుక బంధం ఉన్నట్టా? కదా? అని ప్రశ్నించారు.
Congress : మంత్రుల భేటీపై పుకార్లు.. కీలక నేత క్లారిటీ!
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ పదే పదే చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని.. మరోసారి వారి స్నేహబంధం బట్టబయలైందన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో కుంభకోణం జరిగితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలీదా? కేంద్రంలో ఆయన చూసేది అదే శాఖ కదా? హరీశ్ రావు లేఖ రాసే దాకా తెలియదా? ఆ తర్వాతే విచారణకు ఎందుకు ఆదేశించారు.. ముందే ఎందుకు విచారణ కోరలేదని.. భట్టి విక్రమార్క కేంద్రమంత్రిని సైతం ప్రశ్నించారు. కేంద్రం వద్దే సీబీఐ, ఈడీ ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో కేవలం ఐదు టెండర్లు మాత్రమే జరిగాయని.. గత ప్రభుత్వ హయాంలోనే 20కు పైగా టెండర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. ముందు కేంద్రమంత్రికి హరీశ్ రావు మధ్య ఉన్న బంధం ఏంటో తేల్చాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.