రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయం చూసి కొందరు మంత్రులు రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. అసలు వీరు ఎందుకు ప్రత్యేకంగా సమావేశం కావాల్సి వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రి లేని సమయంలోనే అని సోషల్ మీడియాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్ట నేతలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ కుర్చీ దిగబోతున్నారా? అందుకు సీఎం తర్వాతి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నారా? అని ఆరోపణలు మొదలెట్టారు. మీడియాలోనూ ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
సీఎం ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 1న ఆయన నేరుగా ఢిల్లీకి వస్తారని తెలుస్తున్నది. రాగానే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అవుతారని తెలుస్తున్నది. అయితే, ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, మరో ఇద్దరు, ముగ్గురు మంత్రులు రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తున్నది. దీనిపై లీకులు రాగా.. స్పందించిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. సీఎం లేని సమయంలో పాలనా బాధ్యతలు డిప్యూటీ సీఎం మీదనే ఉంటాయని అందుకే ఆయన మున్సిపల్ ఎన్నికలు, మిగతా అంశాలపై మంత్రులతో భేటీ అయి చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు.
మేడారం జాతర పనులపైనా ఆయన మంత్రులతో సమీక్ష నిర్వహించారని వివరించారు. ఇదిలాఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కొత్తగా పుకార్లు పుట్టిస్తున్నది.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ సీనియర్లు ఎవరికీ ఇష్టం లేదని.. అందుకే ఆయన లేని సమయంలో సీఎం కుర్చీని లాక్కోవాలని ప్రణాళిక రచిస్తున్నారని గులాబీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకుంటే సింగరేణి టెండర్ల కుంభకోణం విషయంలో తన బావమరిది సుజన్ రెడ్డి మీద ఆరోపణలు రావడంతో సీఎం సైతం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్షాలకు మంత్రులు ఎందుకు కౌంటర్లు ఇవ్వడం లైదని అమెరికా నుంచే ఫోన్‌లో గరం అయినట్టు సమాచారం.
SIT : సిట్ దూకుడు.. సంతోష్ రావు తర్వాత ఎవరు?
ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు చేసే విమర్శలు, అవినీతి ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై మంత్రుల మధ్య చర్చ జరిగిందని తెలుస్తున్నది. నైనీ బొగ్గు బ్లాకుల వేలం టెండర్ల రద్దు విషయంలోనూ ఆధారాలతో మాట్లాడాలని మంత్రులకు డిప్యూటీ సీఎం భట్టిదిశానిర్దేశం చేసినట్టు సమాచారం. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఆశావహుల జాబితా ఎక్కడ వరకు వచ్చిందనే అంశంపై మంత్రుల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం అంతా హస్తిన పెద్దలకు వివరించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ మెంబర్ కేసీ వేణుగోపాల్‌తో ఆయన సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలకు ఎలా సన్నద్ధంగా ఉన్న విషయాన్ని పీసీసీ చీఫ్ వెల్లడించినట్టు తెలిసింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలే అని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.