డిమార్ట్ సూపర్ మార్కెట్ లో తక్కువ ధరలకే క్వాలిటీ వస్తువులు లభిస్తాయి. అంతేకాదు, ప్రతి రోజూ ఏదో ఒక ప్రొడక్ట్ మీద భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచుతుంది. ఇతర స్టోర్లతో పోల్చితే, తక్కువ ధరలో ఎక్కువ సరుకులు కొనుగోలు చెయ్యొచ్చనే ఆశతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా డిమార్ట్ లో షాపింగ్ చేస్తారు. నిత్యవసర సరుకులు మొదలుకొని, గృహోపకరణాలు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, దుస్తులు సహా ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. డిమార్ట్ లో తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నా, కొన్ని విషయాల్లో అలర్ట్ గా ఉండాలి. లేదంటే జేబుకు చిల్లు పడటం ఖాయం.
డిమార్ట్ లో బిల్లింగ్ మోసాలకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డిమార్ట్ స్టోర్ల దగ్గర కస్టమర్లు గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి. డిమార్ట్ లో తక్కువ ధరలకు వస్తువులు లభిస్తున్నప్పటికీ బిల్లింగ్ దగ్గర అవకతవకలు జరుగుతున్నట్లు పలువురు కస్టమర్లు ఆరోపించారు కూడా. డిమార్ట్ లో వస్తువులు కొన్న తర్వాత బిల్లును వెంటనే చెక్ చేసుకోకపోవడం వల్ల పెద్ద మొత్తంలో మోసపోయే అవకాశం ఉందని పలువురు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. ఓవైపు డిస్కౌంట్లు ఇస్తూనే, మరోవైపు కస్టమర్ల నుంచి లాగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమార్ట్ బిల్లింగ్ మోసాలకు సంబంధించి పలు స్టోర్లలో వివాదాలు జరగడం ఇందుకు బలాన్ని కలిగిస్తున్నాయి.
తాజాగా ఓ యువకుడు డిమార్ట్ లో కప్ నూడుల్స్ కొనుగోలు చేయాలనుకున్నాడు. ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ ఉంది. ధరను రూ. 40గా ఫిక్స్ చేశారు. సరే అని సదరు యువకుడు ఓ కప్ నూడుల్స్ కొనుగోలు చేశాడు. బయటకు వెళ్లిన తర్వాత బిల్లు చూస్తే, ఒక్కోదానికి రూ. 30 చొప్పున రూ. 60 వసూళు చేశారు. వెనక్కి తిరిగి వచ్చి ఇదేంటని ప్రశ్నిస్తే, ఆఫర్ ఇప్పుడు లేదని చెప్పి, బోర్డు మార్చేశారు. ఆఫర్ కోసం ఆశపడితే మోసంతో తిరిగొచ్చానంటూ సదరు యువకుడు ఓ వీడియోను షేర్ చేశాడు. అటు మరో మహిళకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ 6 కేజీ టాప్ లోడ్ లిక్విడ్ ను కొనుగోలు చేసింది. దీనికి డిమార్ట్ రూ. 405 ఆఫర్ పెట్టింది. ఈ బాక్స్ అసలు ధర రూ.1375 కాగా. ఆఫర్ రూ. 405 పోగా, రూ. రూ. 970 బాక్స్ రావాలి. కానీ, బిల్లులో దీనికి రూ.1,115 వేశారు. తర్వాత బిల్లు చూసి సిబ్బందిని ప్రశ్నిస్తే, కొత్తబిల్ వేసి మిగతా డబ్బులు తిరిగి ఇచ్చారు. ఇలాంటి మోసాల గురించి వినడమే కానీ, తొలిసారి చూశానంటూ సదరు మహిళ డిమార్ట్ మోసాల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కస్టమర్లు స్టోర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బిల్లును మరోసారి చెక్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని తూనికలు, కొలతల అధికారులు చెప్తున్నారు. అందుకే, వినియోగదారులు బిల్లు ఇవ్వగానే ఓసారి చెక్ చేసుకోవాలంటున్నారు. ఏమైనా పొరపాట్లు జరిగితే, వెంటనే సరిచేసుకునే అవకాశం ఉందంటున్నారు.
Read Also: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!