Rajendra Nagar: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఒక బేకరీలో గురువారం పేలుడు సంభవించింది. బేకరీ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మంది గాయపడ్డారు. వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదస్థలంలో పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రగాయాలై ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్ పారిశ్రామికవాడలో ఒక బేకరీని రన్ చేస్తున్నారు. ఈ బేకరీలో సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ప్రతిరోజూ మాదిరిగానే గురువారం ఉదయం కూడా బేకరీలోకి ఆహార పదార్థాలను తయారు చేస్తుండగా.. గ్యాస్ పైప్ లీక్ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అవి వంటగది మొత్తం చుట్టుముట్టడంతో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.