YS Sharmila : వైఎస్సార్ టీపీ. ఆ పార్టీకి షర్మిల అధినేత్రి. చిన్నాపెద్దా లీడర్లు పెద్దగా లేకున్నా.. పార్టీ మాత్రం ఉందని పించేలా షర్మిల వన్ ఉమెన్ షో చేస్తున్నారు. సుదీర్థ పాదయాత్రతో తెలంగాణ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం కలుస్తున్నారు. పార్టీ నిర్మాణం, ప్రజల ఆధరణ ఎలా ఉన్నా.. ఆమె చేస్తున్న విమర్శలు మాత్రం హాట్ హాట్ గా ఉంటున్నాయి. ప్రతిపక్షాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పదునైన ఆరోపణలు, పంచ్ డైలాగ్స్ తో జోరు మీదున్నారు షర్మిల. ఇదంతా సరే మరి పోటీ సంగతేంటి? అంటే మాత్రం సైడ్ అయిపోతున్నారు. యాత్రలు, విమర్శలకే పరిమితమా? ఇలా ఇంకెంత కాలం పబ్బం గడిపేస్తుంటారు? ప్రత్యక్ష పోరులో ఫేస్ టు ఫేస్ తలపడేదెప్పుడు? అనే ప్రశ్నలు ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.
విమర్శలు ఓకే గానీ.. రాజకీయ పార్టీ అంటేనే ఎన్నికలు, గెలుపు ఓటములు. ఓ ప్రైవేట్ ఈవెంట్ లా వైఎస్సార్ టీపీని స్టార్ హోటల్ లో లాంచ్ చేశారు. జెండా, అజెండా ప్రకటించేశారు. పార్టీ పెట్టాక.. హుజురాబాద్ కు ఉప ఎన్నిక వచ్చింది. ఇది అనవసరమైన ఎలక్షన్ అంటూ ఆ పోటీ నుంచి తప్పించుకున్నారు. లేటెస్ట్ మునుగోడు బరిలో నుంచీ తుర్రుమన్నారు. ఆమె తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ నుంచి అభ్యర్థిని నిలిపి విస్తృత ప్రచారం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ఓట్లను చెప్పుకోదగ్గ స్థాయిలోనే కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రవీణ్ కుమార్ కు ఉన్నంత కమిట్ మెంట్, సీరియస్ నెస్.. షర్మిలకు లేదా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. పోటీ చేస్తేనే కదా బలమెంతో.. సత్తా ఎంతో తెలిసేది. తను చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ప్రజా మద్దతు ఉందో లేదో తేలేది ఈవీఎంలతోనే. అంతేగానీ, మీడియాను మేనేజ్ చేస్తూ.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేస్తూ.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మాటల దాడి చేస్తూ పోతుంటే.. ఆమెకు కొద్దో గొప్పో పబ్లిసిటీ వస్తుందేమో గానీ.. అదే స్థాయిలో ఓట్లు వస్తాయా? కేఏ పాల్ లాంటి వాళ్లే పోటీ చేస్తుంటే.. షర్మిలకు మాత్రం పోలింగ్ అంటే ఎందుకంత భయం? పోటీ చేస్తేనే కదా వైఎస్సార్టీపీది వాపో, బలుపో తెలిపోయేది…అంటున్నారు.
ఇక, షర్మిల వెనుక కేసీఆర్ ఉన్నారని.. కాదు కాదు బీజేపీ డైరెక్షన్ అని.. ఇలా పలు రకాల వాదనలు అప్పుడూఇప్పుడూ వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకే షర్మిలను బాణంలా వదిలారని అంటారు. షర్మిలకు దళిత, మైనార్టీ వర్గాల్లో కాస్త ఆదరణ ఉందని అంచనా. ఇక, వైఎస్సార్ అభిమానులు ఏ మేరకు అండగా నిలుస్తారో తెలీదు. అయితే, ఈ రెండు వర్గాలు ప్రస్తుతం కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. వైఎస్సార్ పేరుతో పార్టీ పెట్టి పోటీ చేస్తే పడే ఓట్లన్నీ కాంగ్రెస్ వే. అలా హస్తం పార్టీ ఓటు బ్యాంకును చీల్చి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే షర్మిలతో పార్టీ పెట్టించి.. తెలంగాణలో తిప్పుతున్నారనే వాదనా ఉంది. షర్మిల పార్టీ వల్ల ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ లాంటి జిల్లాల్లో కాంగ్రెస్ ఓట్లకు గండి పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రధాన పార్టీలు ఆమెను పెద్దగా పట్టించుకోకున్నా.. షర్మిల మాత్రం తన దారిన తాను పొలిటికల్ జర్నీ చేస్తూనే ఉన్నారు.