Indian Railways: మరికొద్ది రోజుల్లో 2024 పూర్తై 2025లో ఎంటర్ కాబోతున్నాం. కొత్త సంవత్సరంలో భారతీయ రైల్వే సరికొత్త మైలు రాళ్లను అధిగమించబోతున్నది. యావత్ దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై స్పీడ్ బుల్లెట్ రైళ్ల ప్రారంభం, ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు నేరుగా వందే భారత్ సర్వీస్, వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం లాంటి అరుదైన ఘట్టాలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది రైల్వే ప్రయాణీకులకు ఎంతో కీలకం కాబోతున్నది.
⦿ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రారంభం
ముంబై -అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (MAHSR) బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఈ రూట్ 508 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో పాటు దేశంలో మరిన్ని బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు భారతీయ రైల్వే సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతానికి, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు 12 కీలక స్టేషన్లను కలుపుతుంది. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్లిమోర, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలు గంటలకు 320 కి. మీ వేగంతో ప్రయాణించనుంది. ఆ తర్వాత ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృత్‌సర్, ముంబై-నాగ్ పూర్ లాంటి కొత్త రైలు కారిడార్ల కు సంబంధించి డీపీఆర్ లను రెడీ చేయాలని ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను అదేశించింది.
⦿ ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు తొలి వందే భారత్ సర్వీస్
న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు నేరుగా నడిచే వందేభారత్ రైలు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇది భారతీయ రైలు ప్రయాణంలో కొత్త మైలురాయిగా నిలువబోతోంది. వందే భారత్ సిరీస్‌లో ఇది మొదటి స్లీపర్ వేరియంట్. ఈ రైలు శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) మీదుగా ప్రయాణిస్తుంది. 800 కి. మీ దూరాన్ని సుమారు 13 గంటల్లో చేరుకోనుంది. ఈ రూట్ అంబాలా కాంట్ జంక్షన్, లూథియానా జంక్షన్, కథువా, జమ్మూ తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, సంగల్దాన్, బనిహాల్, చినాబ్ బ్రిడ్జ్ వంటి కీలక స్టేషన్లలో హాల్టింగ్ తీసుకోనుంది. ప్రపంచంలోనే అత్యతం ఎత్తైన రైల్వే బ్రిడ్జి మీదుగా ఈ రైలు వెళ్లనుంది. 2025 జనవరి 26న ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. ఈ సర్వీస్ ఢిల్లీ నుండి రాత్రి 7 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఈ రైలుకు సంబంధించిన టికెట్ ధరలు రూ. 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది.
⦿ త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు ఫీల్డ్ ట్రయల్స్ ప్రారంభం
వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించి త్వరలో ఫీల్డ్ ట్రయల్స్ కు రెడీ అవుతోంది. ఈ స్లీపర్ రైళ్లు కవచ్ లాంటి ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ, క్రాష్ వర్తీ సెమీ-పర్మనెంట్ కప్లర్లు, అధునాతన ఫైర్ సేఫ్టీ చర్యలతో పాటు సడెన్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటాయి. అటు హైడ్రోజన్ రైలు కూడా త్వరలో ట్రాక్ ఎక్కేందుకు రెడీ అవుతోంది.
Read Also: ఇదెక్కడి రైలు రా మామా, ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు పట్టిందా?