వర్షాకాలం వచ్చేసింది. నదులు, సరస్సులు, వాగులు నీళ్లతో నిండిపోయి అందంగా కనిపిస్తాయి. ఇక జలపాతాలు కొండల మీద నుంచి దూకుతూ ఎంతో అందంగా ఉంటాయి. తేలికపాటి చినుకులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు అలా విహారయాత్రకు వెళితే అదిరిపోతుంది.
నిజానికి విహారయాత్రకు ప్లాన్ చేయడానికి ఇదే అనువైన సమయం కూడా. మీకు జలపాతం అంటే ఇష్టమా? అయితే వైజాగ్ కి సమీపంలో ఉన్న ఒక అందమైన జలపాతాన్ని చూడండి. ప్రకృతి మధ్యలో కొండల మీద నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు.
తారాబు జలపాతాలు
వైజాగ్ నుండి 170 కిలోమీటర్ల దూరంలోనే తారాబు జలపాతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అతి ఎత్తయిన రెండో జలపాతం ఇది. దాదాపు 500 మీటర్ల ఎత్తు నుండి నీరు కిందకు దూకుతుంది. ఈ తారాబు జలపాతాలు పాడేరు సమీపంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి ఈ జలపాతాల గురించి తెలియదు. ఈ జలపాతాలను చూస్తూ ఉంటే కనుల పండగలాగే ఉంటుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాకు దగ్గరగా ఈ తారాబు జలపాతాలు ఉంటాయి. వీటిని గుంజివాడ జలపాతాలు, పిట్టల బోర జలపాతాలు అని కూడా పిలుచుకుంటారు. కొండ అడవులలో ఒడిశా సరిహద్దుకు దగ్గరలో ఈ జలపాతాలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నప్పటికీ ఆంధ్ర వైపు నుంచి ఈ జలపాతాలను చేరుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఒరిస్సా నుంచి అయితే చాలా సులువుగా చేరుకోవచ్చు.
తారాబు జలపాతాలు చుట్టూ దట్టమైన పచ్చదనం నిండి ఉంటుంది. పొగ మంచుతో ఆ పర్వత గాలి నిండిపోయి ఉంటుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ అద్భుతమైన జలపాతానికి చేరుకోవాలంటే కాస్త సాహసోపేతంగా నడవాల్సి రావచ్చు. బైకర్లు, ట్రెక్కర్లు, ప్రకృతి ప్రేమికులకు నచ్చే ప్రదేశం ఇది.
జలపాతాన్ని అంత సులువుగా చేరుకోలేరు. అడవుల్లోంచి కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణం సాహస యాత్రలా అనిపిస్తుంది. అది కూడా జనసమూహానికి దూరంగా ఉండే ఈ జలపాతానికి చేరడానికి ఒంటరిగా వెళ్లకూడదు. గుంపులుగా వెళ్లడమే మంచిది. ఈ మార్గంలో వాగులు దాటాల్సి వస్తుంది. ఆ వాగులు కూడా స్వచ్ఛమైన నీటితో నిండి ఉంటాయి. మోటార్ బైకర్లు కూడా ఈ మార్గంలో ప్రయాణం చేయవచ్చు.
తారాబు జలపాతానికి ఎలా వెళ్లాలి?
విశాఖపట్నం నుండి పాడేరు వెళ్ళండి. అక్కడి నుంచి ఈ తారాబు జలపాతం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదటగా అనకాపల్లి మీదుగా, భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు మీదుగా, పాడేరు డుంబ్రిగూడ అరకు రోడ్డు ద్వారా ప్రయాణించవచ్చు. 170 కిలోమీటర్ల ప్రయాణమే అయినా ఐదున్నర గంటల సమయం పడుతుంది. ఈ జలపాతానికి వెళ్లేందుకు రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఆ రెండు మూడు కిలోమీటర్లు రోడ్డు సరిగా ఉండదు. చిన్న చిన్న కొండలు ఎక్కాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కాస్త బురద బురదగా ఉంటుంది.
ఈ జలపాతానికి వెళ్లాలనుకునే వారు నీళ్లు, ఆహారము సమృద్ధిగా తీసుకువెళ్లాలి. ఎందుకంటే దీనికి దగ్గరలో హోటల్లు, దుకాణాలు ఏవీ ఉండవు. కాబట్టి భోజనం, స్నాక్స్, నీరు.. అన్నీ బ్యాగుల్లో సర్దుకుని వెళ్ళండి. వర్షాకాలంలో ఈ ప్రదేశం అందంగా ఉంటుంది. కాకపోతే బురదతో కాస్త జారుడుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలి. లేదా శీతాకాలంలో చూస్తే మరింత అందంగా ఉంటుంది.