US flight crisis: అమెరికాలో విమాన ప్రయాణం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా విమాన రవాణా వ్యవస్థ గందరగోళానికి గురవుతోంది. వేతనాలు రాకపోవడంతో అనేక మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విధులకు దూరమవుతున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా వందలాది ఫ్లైట్లు రద్దు కాగా, వేల సంఖ్యలో విమానాలు గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే 39 రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వ షట్‌డౌన్, అమెరికా చరిత్రలో ఇంత కాలం కొనసాగిన అరుదైన ఘటనగా నిలిచింది.
1,460 ఫ్లైట్లు రద్దు..దాదాపు 6,000 ఫ్లైట్లు ఆలస్యం
శనివారం రోజునే 1,460 ఫ్లైట్లు రద్దు కాగా, దాదాపు 6,000 ఫ్లైట్లు ఆలస్యం అయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని 37 ప్రధాన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అట్లాంటా, న్యూయార్క్, చికాగో, సాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల్లో విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆలస్యంపై ప్రయాణికులు ఆవేదన
అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌లోనే సుమారు 282 నిమిషాల ఆలస్యం నమోదైంది. అంటే దాదాపు 4 గంటలు ప్రయాణికులు వినానం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఏఏ ఆదేశాల ప్రకారం, ఇప్పటికే 40 ప్రధాన విమానాశ్రయాల్లో రోజువారీ ఫ్లైట్‌లను 4 శాతం తగ్గించారు. ఈ సంఖ్య మంగళవారం నుంచి 6 శాతానికి, నవంబర్ 14 నుంచి 10 శాతానికి పెరగుతుందని సమాచారం.
జీతాలు లేకుండా విధులు
అమెరికన్, డెల్టా, యునైటెడ్, సౌత్‌వెస్ట్ వంటి ప్రముఖ ఎయిర్‌లైన్స్ కలిసి రోజుకి వందలాది విమానాలను రద్దు చేస్తున్నాయి. వేతనాలు రాకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విధులకు దూరమవుతుండటమే ఈ సమస్యకి ప్రధాన కారణం. ప్రస్తుతం 13,000 విమానాల రాకపోకలను పర్యవేక్షించే అధికారులు, 50,000 భద్రతా సిబ్బంది కూడా జీతాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు.
అమెరికా ఆకాశం పూర్తిగా మూగబోయే అవకాశం
అమెరికా సెనేట్‌లో, అంటే అమెరికా పార్లమెంట్‌లోని ఉన్నత సభలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రిపబ్లికన్లు ‘క్లీన్ ఫండింగ్ బిల్’ను ఆమోదించాలని ఒత్తిడి తెస్తుండగా, ప్రతిపక్షం మాత్రం ఆరోగ్య బీమా సబ్సిడీలపై చర్చ లేకుండా బిల్లు ఆమోదించబోమని స్పష్టం చేసింది. దీంతో ఈ రాజకీయ తగాదా మధ్యలో చిక్కుకున్నది సాధారణ ప్రజలే. ప్రస్తుతం అమెరికా అంతటా విమానాశ్రయాలు గందరగోళంగా మారాయి. రద్దయిన టికెట్లతో ప్రయాణికులు నిరాశలో మునిగిపోయారు. ఈ షట్‌డౌన్ త్వరగా ముగియక పోతే రాబోయే రోజుల్లో అమెరికా ఆకాశం పూర్తిగా మూగబోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.