Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, చాలా మందిలో ఒక డౌట్ ఉంది. విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయాన్ని ఎందుకు నిర్మించారు? నగరానికి దగ్గరలోనే మరో ఎయిర్‌పోర్టు ఉండగా కొత్తదాన్ని ఇంత దూరంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం INS దేగా నౌకాదళ స్థావరంలో భాగంగా పనిచేస్తోంది. అక్కడ సివిల్ విమానాలతో పాటు నేవీ కార్యకలాపాలు కూడా జరుగుతాయి. భద్రతా కారణాల వల్ల విమానాల రాకపోకల సమయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయి. దీంతో భవిష్యత్తులో విమానాల సంఖ్య భారీగా పెరిగితే వాటిని మెయింటెయిన్ కష్టంగా మారే అవకాశం ఉంది. అటు పాత ఎయిర్‌పోర్టు నగర మధ్యలో ఉండటంతో రన్ వే ను మరింత పొడిగించడం, కొత్త టెర్మినల్స్ నిర్మించడం, పెద్ద కార్గో హబ్ ను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యం. నగరం చుట్టూ ఇప్పటికే భవనాలు, రహదారులు ఉండటంతో విస్తరణకు అవకాశం చాలా తక్కువగా ఉంది.
భోగాపురంలో అవసరమైన భూమి అందుబాటులో ఉన్న ప్రాంతం. అందుకే ఇక్కడ 3,800 మీటర్ల పొడవైన రన్ వేను నిర్మించారు. దీని ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన Airbus A380 లాంటి భారీ విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు, భారీ కార్గో కార్యకలాపాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
మరో కీలక అంశం వాతావరణ పరిస్థితులు. విశాఖ నగరానికి తూర్పు కనుమలు, కొండలు చాలా దగ్గరగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఆపరేషనల్ పరిమితులు ఎదురవుతాయి. సముద్ర తీరం ప్రాంతంలో ఉదయం వేళల్లో పొగమంచు, తేమ, గాలుల దిశలో మార్పులు కూడా విమానాల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. భోగాపురం ప్రాంతంలో విశాలమైన ఓపెన్ ఏరియా ఉండటంతో విమానాల రాకపోకలను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ కొత్త విమానాశ్రయాన్ని మొదటి దశలోనే ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా రూపొందించారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి దీన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త అవకాశాలను తీసుకురానుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కూడా లభించే అవకాశం ఉంది. సో, భోగాపురం ఎయిర్ పోర్టును విశాఖకు దూరంగా నిర్మించడం యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదు. పాత విమానాశ్రయంలో ఉన్న పరిమితులు, భవిష్యత్తు అవసరాలు, పెద్ద విమానాల నిర్వహణ, కార్గో సదుపాయాలు, వాతావరణ పరిస్థితులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also: విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్ పోర్ట్ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!