హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టులో ప్రయాణికుల రాకపోకలు అమాంతంగా తగ్గింది. ఇందుకు రకరకాల కారణాలు వెల్లడించింది జీఎంఆర్ సంస్థ. అంతర్జాతీయ యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, ట్రంప్ నిర్ణయాలు కారణాలుగా పేర్కొంది.
అంతర్జాతీయ పరిణామాలు దేశంలోని అన్ని రంగాలపై క్రమంగా చూపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ప్రయాణికుల సంఖ్య 11.5 శాతం తగ్గినట్లు స్పష్టం చేసింది జీఎంఆర్. సుమారు 11 శాతంపైగా ప్రయాణికులు తగ్గటానికి గల కారణాలు వివరించింది. అంతర్జాతీయ యుద్ధ ప్రభావం, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రయాణాలపై ఉన్నట్లు తన నివేదికలో ప్రస్తావించింది. ఆగస్టులో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 21,86,082 మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారు. అందులో దేశీయ, విదేశీ ప్రయాణికులు ఉన్నారు.
గతేదాడి ఆగష్టు నెలతో పోల్చితే ఆ సంఖ్య 24,70,499గా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలో దాదాపు 2.84 లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయారు. అందులో దేశీయ ప్రయాణికులు 13.6 శాతం కాగా, అంతర్జాతీయ ప్రయాణికులు 26 శాతం తగ్గినట్టు పేర్కొంది. జూలై కంటే ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జూలైలో ప్రయాణికుల రద్దీ 9.6 శాతం తగ్గింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణీకుల రద్దీ ఏటా పెరుగుతూ వచ్చింది. ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ పరిణామాలు ఆ ధోరణిని తారుమారు చేశాయి. ప్రయాణీకుల సంఖ్య తగ్గడం విమాన కార్యకలాపాలు తగ్గడానికి కూడా దారి తీసింది.
ఆగస్టులో శంషాబాద్ విమానాశ్రయానికి 14,583 విమాన రాకపోకలు నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14.2 శాతం విమానాల రాకపోకలు తగ్గాయి. విమానాలతోపాటు ప్రయాణికులు తగ్గడం వెనుక అసలు కారణాలు వెల్లడించింది జీఎంఆర్ సంస్థ. అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఆంక్షలు, పెరిగిన ఇంధన ధరలు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై అమెరికా ఆంక్షల ప్రభావం కనిపించిన్టు ఆ నివేదిక పేర్కొంది.
కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. గోవాలోని జీఎంఆర్ నిర్వహిస్తున్న మోపా ఎయిర్‌పోర్టులో ఆగస్టు నెల ప్రయాణికుల రద్దీ తగ్గింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ప్రయాణికుల రద్దీ 22.8 శాతం పడిపోయింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ దాదాపు 6 శాతం తగ్గింది. కేవలం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆగస్టులో 60,83,616 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 2.7 శాతం అధికం. అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 1.7 శాతం, దేశీయ ప్రయాణికులు 3 శాతం పెరిగింది. ఇక విమానాల రాకపోకలు 11.8 శాతం పెరిగాయి. సరుకు రవాణా 11 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే 11.5 శాతం అధికం.
ALSO READ: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!