Araku: వరుస సెలవులు రావడంతో.. ఆంధ్ర ఊటీ ‘అరకు’ కు టూరిస్టులు క్యూకట్టారు. శీతాకాలంలో అరకులో ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రకృతి రమణీయతను వీక్షించేందుకు పర్యటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. విశాఖకు సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు.. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంది. అరకు తూర్పు కనుమలలోని అద్భుత పర్వత శ్రేణి ఉంది. విశాఖ నుంచి అరకు ప్రయాణం అందమైన అనుభూతిని అందిస్తుంది. ట్రైన్ జర్నీ మరింత అద్భుతంగా ఉంటుంది.
వరుస సెలవులతో అరకుకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. పర్యాటకుల రద్దీతో ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. అరకు వెళ్లే మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అరకు ఘాట్ రోడ్డును ఒకవైపు క్లోజ్ చేశారు. టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అరకు నుంచి విశాఖ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి అరకు వెళ్లే వాహనాలనే అనుమతిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా.. అరకు నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు పాడేరు మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
పద్మాపురం గార్డెన్, ట్రావెల్ మ్యూజియం, చాపరాయి ప్రాంతాలకు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో టూరిస్టులు రావడంతో రూములు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఉడెన్ బ్రిడ్జి టైమింగ్స్ కూడా మార్పులు చేశారు. సుంకరమెట్ట సమీపంలో నిర్మించిన ఉడెన్ బ్రిడ్జ్ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఉడెన్ బ్రిడ్జి సందర్శన వేళల్లో మార్పులు చేశారు. నేటి నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు. పర్యాటకుల సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ కోసమే సమయాల్లో మార్పులు చేశామని అధికారులు తెలిపారు.
Also Read: Kailasagiri: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.. వెనక్కి దూసుకెళ్లిన టాయ్ ట్రైన్.. చివరకు ఏమైందంటే?
అల్లూరి జిల్లాలోని వంజంగి కొండలు శీతాకాల అందాలను సంతరించుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలు, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. వంజంగి పాడేరుకి 8 కిలోమీటర్ల దూరంలో పర్యాటక ప్రదేశం. వంజంగి కొండలపై కురిసే మంచు కశ్మీర్ అందాలను తలపిస్తుంది. ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ అనంతరం ఈ అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. లంబసింగిలో కూడా పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది.