Multi train ticket: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేవాళ్లకు ఇది నిజంగా ఓ గేమ్‌చేంజర్.. ఇప్పుడు మీరు ఒక్క టికెట్‌తోనే మెట్రో, సబ్‌ర్బన్, MRTS రైళ్లు ఎక్కొచ్చు! అదీ మనదేశంలోని ఒకే ఒక నగరంలో మాత్రమే. ఇప్పటిదాకా రైలు మారిస్తే టికెట్ మార్చాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా.. ట్రైన్ మారినా టికెట్ మార్చాల్సిన పనిలేదు. ఈ మార్పు చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. ఎందుకంటే, ఇది ఒకటే నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ అంతా ఒక్కదానిగా కలిపే దిశగా తీసుకున్న తొలి పెద్ద అడుగు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆమోదం కూడా వచ్చేసింది.
చెన్నై నగరంలోని పౌరుల రవాణా అనుభవాన్ని సమూలంగా మార్చే కీలక పరిణామం ఇది. మెట్రో, MRTS, సబ్‌ర్బన్ రైలు మార్గాల్ని ఒకే టికెట్‌తో ప్రయాణించుకునే అవకాశం కలిగించడమే ఈ మార్పు ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు రైలు మారిస్తే టికెట్ కూడా మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై చెన్నైలో ట్రైన్ మారినా, టికెట్ మారాల్సిన అవసరం ఉండదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో నిత్యం ప్రయాణించే వాణిజ్య ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికుల కోసం ఇది నిజంగా ఓ గేమ్‌చేంజర్.
ఈ వ్యవస్థ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోదం పొందింది. జూలై 31న ఆమోదం లభించగా, జూలై 16న జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో దక్షిణ రైల్వే అధికారులు సమగ్ర వివరాలతో సమర్పణ చేశారు. దీని ఆధారంగా మాసివ్ విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణాత్మక ఒప్పందం (MoU) తయారవుతోంది. ఈ ఒప్పందం మేరకు MRTS భౌతిక వనరులన్నీ, అంటే ట్రాక్‌లు, భవనాలు, విద్యుదీకరణ వ్యవస్థ, భూములు మొదలైనవన్నీ చెన్నై మెట్రో రైల్వే (CMRL) ఆధీనంలోకి వస్తాయి.
ఈ విలీనంతో MRTSలో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి వారికి లభిస్తాయి. ఇక దక్షిణ రైల్వే ఆధీనంలో ఉన్న భూములు లీజుపై తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతం MRTSలో నడుస్తున్న ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (EMUs) రెండు సంవత్సరాల పాటు ఉచితంగా మెట్రో రైల్వే వినియోగించుకోనుంది. ఆ తరువాత వీటిని దక్షిణ రైల్వేకు తిరిగి అప్పగించాలి లేదా తగ్గిన విలువను చెల్లించాలి.
విలీన అనంతరం ప్రారంభ దశలో, దక్షిణ రైల్వే సిబ్బందిని మెట్రోకి అందిస్తుంది. ఈ సమయంలో మెట్రో సంస్థ సొంత సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వనుంది. ఫోర్ట్, చెన్నై బీచ్ వంటి ప్రధాన స్టేషన్ల యాక్సెస్ చార్జీలపై రెండు సంస్థలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోనున్నాయి.
Also Read: Foreign university: విదేశాలకు ఎందుకు? విశాఖపట్నంకు వచ్చిన విదేశీ విశ్వవిద్యాలయం.. మీరు రెడీనా?
చెన్నై MRTS చరిత్ర 1997లో ప్రారంభమైంది. మొదట చెన్నై బీచ్ నుంచి చెపాక్ వరకూ నడిచిన ఈ మార్గం, కాలక్రమంలో 2007 నాటికి వెలచేరి వరకూ విస్తరించబడింది. ప్రస్తుతం సెయింట్ థామస్ మౌంట్ వరకూ నిర్మాణం తుది దశలో ఉంది. ఇది పూర్తయితే మొత్తం 25 కిలోమీటర్ల పొడవున 21 స్టేషన్లు పనిచేస్తాయి. ఈ మార్గం రోజుకు సుమారు 1 లక్ష మంది ప్రయాణికులకు సేవలందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఈ విలీనంతో చెన్నై నగరానికి కలుగబోయే ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా మెట్రో, MRTS, సబర్బన్ రైలు, బస్సుల మధ్య ఒకే టికెట్‌తో ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ఇదే సీమ్‌లెస్ ట్రావెల్ (seamless travel). అంటే ప్రయాణికుడు మొబైల్ యాప్‌లోనే రూట్ ప్లాన్ చేసుకొని, ఒకే టికెట్‌తో అన్ని రవాణా మార్గాల్లో ప్రయాణించగలడు.
అలాగే MRTS స్టేషన్లు, సర్వీసులు మెట్రో స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఆధునీకరించబడతాయి. విద్యార్థులు, ఉద్యోగులు సమయాన్ని ఆదా చేసుకునేలా వేగవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తుంది. నగర శివార్ల నుంచి సిటీ సెంటర్ వరకూ ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయుక్తం. ముఖ్యంగా పెద్దపల్లి, తాంబరం, వెలచేరి ప్రాంతాలనుంచి డౌన్‌టౌన్ చెన్నైకి వెళ్లే వారి కోసం ఇది అత్యంత ఉపయోగకరమైన మార్గం.
ఇంతవరకూ దేశంలోని ఏ నగరంలోనూ మల్టీ మోడల్ ట్రాన్సిట్‌ను ఒకే టికెట్‌తో అందించలేదు. చెన్నై ఈ విషయంలో తొలి మెట్రోపాలిటన్ నగరంగా నిలిచింది. ఇది రవాణా రంగంలో భారతదేశం తీసుకున్న కీలక ముందడుగు. ఇకపై మెట్రో, MRTS, సబ్‌ర్బన్ రైలు, బస్సు ప్రయాణాలన్నీ ఒకదానిగా కలుస్తాయి. ఇది దేశవ్యాప్తంగా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌కి మార్గదర్శిగా నిలవబోతోంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం.. రైల్వే శాఖల మధ్య సమన్వయంతో సాధ్యమైంది. ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవస్థను సమగ్రంగా రూపుదిద్దే ప్రయత్నానికి ఇది నాంది. ఇక ప్రయాణికులు ఏ ట్రైన్ ఎక్కినా, మార్గం మారినా, ఒక్కటే టికెట్‌తో ప్రయాణించగలమన్న సౌలభ్యం.. ఈ మార్పు విశిష్టతను స్పష్టంగా తెలియజేస్తుంది. చెన్నై రవాణా చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ మలుపు.