Chiranjeevi Vs Mohan Babu: ఈ మధ్య టాలీవుడ్ తరచూ వివాదంలో నిలుస్తోంది. మొన్నటి వరకు అల్లు, మెగా ఫ్యామిలీ వివాదం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత మంచు ఫ్యామిలీ వివాదం.. నిర్మాతల వార్.. తాజాగా కార్మికుల సమ్మె. ఇలా కరోనా తర్వాత టాలీవుడ్లో విచిత్ర పరిస్థితులు చూస్తున్నాం. వినోద పరిశ్రమ కాస్తా వివాద పరిశ్రమగా మారుతోంది. అయితే తరుణంలో ఇండస్ట్రీ పెద్ద అనే వాదన కూడా తెరపై వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. నెటిజన్స్ అభిప్రాయం ప్రకారం.. టాలీవుడ్ పెద్ద అనే ప్రస్థావన వస్తే.. చాలామంది మెగా ఫ్యామిలీ అంటారు. చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్దన్న అంటారు.
ఇండస్ట్రీ పెద్ద ఎవరూ?
అయితే ఈ విషయంలో మెగా ఫ్యామిలీతో పోటీ ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ బాబు ఫ్యామిలీ. టాలీవుడ్ లో మెగాస్టార్ వర్సెస్ మోహన్ బాబు అన్నట్టుగా ఉంది. కానీ, ఈ విషయంలో పైచేయి మాత్రం చిరంజీవిదే అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా.. దానికి పెద్ద దిక్కు చిరంజీవి అనేది అందరి అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏం జరిగినా, ఏం జరుగుతున్నా.. అది చిరు అండర్నే ఉంటుందని పలువురి అభిప్రాయం. చిత్ర పరిశ్రమ సమస్యల్లో ఉంటే ముందుకు పెద్దలకు గుర్తొచ్చేది చిరంజీవినే. సమస్య ఏదైనా.. చిరు దగ్గరికి వెళితేనే అది కొలిక్కి వస్తుంది. ఈ విషయంలో తాజా సమ్మె సైతం రుజువు చేసింది. కార్మికుల సమ్మెతో సతమతంలో ఉన్న నిర్మాతలు ముందుగా ఆశ్రయించింది చిరంజీవినే. దీన్ని బట్టి తెలుస్తోంది టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఉందో.
దీనికి కారణం చిరు ఎప్పుడు నిర్మాతలకు, నటీనటులకు అందుబాటులో ఉంటారు. అంతేకాదు ఆయన సామాజిక సేవ కూడా చిరుకి ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. మరోవైపు తనదైన నటన, సినిమాలో ఇండస్ట్రీకి విశేష సేవలు అందించారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ సమస్యల్లో ఉందంటే ముందుగా నిలిచేది ఆయనే. ఏపీలో టికెట్ రేట్ల సమస్య టైంలో సినీపెద్దలతో కలిసి చిరు అప్పటి ఏపీ సీఎం జగన్ని కలిశారు. అంతేకాదు గద్దర్ అవార్డుల వివాదంలోనూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వివాద పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించారు. అయితే ఈ కీలక సందర్భాల్లో మెహన్ బాబు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కొంతకాలంగా మోహన్ బాబు అసలు ఇండస్ట్రీలో ఉన్నారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. సినీ ప్రయాణం ఇద్దరిది నేటి తరాలకు స్ఫూర్తి.
సీనియర్ మోహన్ బాబే.. కానీ!
నిజానికి చిరంజీవి కంటే మోహన్ బాబే ముందుగా పరిశ్రమలోకి వచ్చారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి పద్మశ్రీ వరకు మోహన్ బాబు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. కానీ, నిజ జీవితంలో ఆయన వ్యక్తిత్వం, ధోరణిపై విమర్శలు ఉన్నాయి. ఇండస్ట్రీకి ఆయన ఎన్నో హిట్, సూపర్ హిట్ చిత్రాలు అందించారు. చెప్పాలంటే ఓ దశాబ్ధం ఆయనేదే అని చెప్పుకోవచ్చు. దాసరి నారాయణ రావు శిష్యుడని చెప్పుకునే మోహన్ బాబు నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పెదరాయుడు (1995), అసెంబ్లీ రౌడీ (1991), మేజర్ చంద్రకాంత్ (1993) వంటి చిత్రాలు ఆయన కెరీర్లో మైలురాయి సాధించాయి. నిర్మాతగానూ ఎన్నో సినిమాలు నిర్మించారు. మోహన్ బాబు యూనివర్సిటీ పేరుతో విద్యావేత్తగా కూడా మారారు. ఇలా నటుడిగా, వ్యాపారవేత్త రాణిస్తున్న ఆయన ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పేరుని గడించలేకపోయారు. దీనికి కారణం ఆయన వ్యక్తిత్వ ధోరణి, తానే గొప్ప నటుడనంటూ చెప్పుకునే గర్వపు మాటలు. నిజానికి ఆయన తీరు ఇండస్ట్రీలో చాలామందికి రుచించదని నెటిజన్స్ అభిప్రాయం. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ చెప్పుకునే సన్నిహితులు చాలా తక్కువ. మరోవైపు ఆయన కుమారుల మధ్య వివాదాలు, కుటుంబ గొడవలు.. మోహన్ బాబుని ఇండస్ట్రీకి మరింత దూరంగా చేస్తున్నాయని అంటున్నారు.
అందుకే చిరు పెద్దన్న అయ్యారు
ఇక మెగా ఫ్యామిలీ..ముఖ్యంగా చిరు గురించి చెప్పుకుంటే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్త్వం ఆయనది. మెగా పేరుతో ఇండస్ట్రీకి మహావృక్షంలా ఎదిగారు. ఇది ఇండస్ట్రీలో ఎంతోమంది అన్న మాట. ఇక నేటి యువ నటులు పరిశ్రమకు రావడానికి చిరంజీగారు స్ఫూర్తి అంటారు. అలా నేటికి, రేపటి తరాలకు స్ఫూర్తిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిది ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం అనాలి. ఆయన గొప్ప వ్యక్తిత్వానికి తోడు.. మెగా బ్రదర్స్ మధ్య ఉండే బాండింగ్. అందరు స్టార్స్ అయినా.. వారి మధ్య ఎలాంటి కలతలు, విభేదాలకు చోటు లేదు. చిరంజీవి లెగసీని మెగా వారసుడిగా రామ్ చరణ్ గొప్పగా కొనసాగిస్తున్నాడు. గ్లోబల్ స్టార్గా మారి మెగా స్టార్డమ్ని పది రేట్లు పెంచాడు. కొడుకునే కాదు.. నాగాబాబు కొడుకు వరుణ్ తేజ్, మేనల్లుళ్లను కూడా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టారు. మరోవైపు తన బావమరిది అల్లు అరవింద్ని కూడా నిర్మాతగా గొప్ప స్థాయిలో ఉండేలా సపోర్టు ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ ఎదుగుదలకు కూడా ఆయన ఎంతో తొడ్పాటునిచ్చారు. ఇలా తను మాత్రమే కాకుండ తన చూట్టూ ఉన్న వారిని కూడా ఇండస్ట్రీలో నిలబెడుతూ.. టాలీవుడ్లో మెగావృక్షంగా నిలబడ్డారు. అందుకే మోహన్ బాబు తర్వాత ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆయన వ్యక్తిత్వం, గొప్పతనం ఆయనను టాలీవుడ్ పెద్దన్నగా నిలబెట్టాయి.