China Marriage: యువత వివాహాల పట్ల ఆసక్తి చూపకపోవడంతో వివాహ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు చైనా ప్రభుత్వం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. సాంప్రదాయ సివిల్ అఫైర్స్ ఆఫీసులకే పరిమితం కాకుండా బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, నైట్ క్లబ్బుల్లో కూడా వివాహ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పడిపోతున్న వివాహాల సంఖ్యను పెంచేందుకే ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తియాంజిన్ మున్సిపాలిటీలోని ‘పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా’ శాఖ దేశంలోనే మొదటిసారిగా బ్యాంకింగ్ కేంద్రంలోనే వివాహ నమోదు సేవలను ప్రారంభించింది. ఆ తర్వాత షాండోంగ్ ప్రావిన్స్‌లోని ఒక ప్రసూతి – శిశు సంరక్షణ ఆసుపత్రి కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పెళ్లి నమోదు, వివాహ సంబంధిత వైద్య పరీక్షలు, సంతానోత్పత్తి సలహాలను ఒకే చోట అందించడం ద్వారా జంటలకు సమయం ఆదా అవుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
చైనాలోని గ్వాంగ్‌జౌ బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయం.. వివాహ ధృవపత్రాలను జారీ చేస్తున్న తొలి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. ఇక్కడ నమోదు చేసుకున్న జంటలకు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు చూసేందుకు ఉచిత ప్రవేశాన్ని కూడా కల్పించారు. మరోవైపు బీజింగ్, నాంజింగ్‌లలోని పురాతన దేవాలయాల్లోనూ జంటలు పెళ్లి సర్టిఫికెట్లు పొందుతుండగా.. హెఫీ నగరంలో ఒక మెట్రో స్టేషన్ కూడా ఈ సేవలను ప్రారంభించింది. అటు షాంఘైలోని ఒక నైట్ క్లబ్ ఏకంగా స్థానిక అధికారులతో ఒప్పందం చేసుకొని ప్రత్యేకంగా మ్యారెజ్ సర్టిఫికెట్ కస్టమర్లకు అందిస్తోంది.
ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం గతేడాదే వివాహ నమోదు నిబంధనలను సడలించింది. దీని ప్రకారం జంటలు తమ నివాస ప్రాంతంతో సంబంధం లేకుండా, ఎక్కడైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇందుకు నివాస ధ్రువీకరణ పత్రం (హుకూ) సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈ నిబంధనల మార్పుతో దేశవ్యాప్తంగా దాదాపు 500కి పైగా ప్రభుత్వేతర కేంద్రాలు, 1,300 కంటే ఎక్కువ ప్రైవేటు ఏజెన్సీలు మ్యారేజ్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాయి. అయితే ప్రభుత్వం వాటిని పరిశీలించి.. అర్హులైన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తోంది.
Also Read: దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎగ్జామ్.. మద్యం తాగి పరీక్షా కేంద్రానికి స్టూడెంట్, తెలంగాణలో ఘటన
పెళ్లిపై చైనా ఇచ్చిన సడలింపుల వల్ల ప్రారంభంలో వివాహాల సంఖ్య కొంత పెరిగినప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో మళ్లీ 7.5 శాతం మేర నమోదులు తగ్గాయి. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వివాహాలకు ఆటంకంగా నిలుస్తున్నది ప్రక్రియలో ఉన్న సంక్లిష్టత కాదని.. భవిష్యత్తుపై ఉన్న ఆర్థిక భయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతామనే ఆందోళనలే కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.