World’s Biggest Cashew Tree: సాధారణంగా జీడి చెట్టు అంటే ఓ మోస్తరు ఎత్తులో ఉంటుంది. కానీ, బ్రెజిల్‌లో ఉన్న ఓ జీడి చెట్టు చాలా ప్రత్యేకం. ఇది ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు పెరగలేదు. కానీ, నేల మీద ఏకంగా వేల చదరపు మీటర్ల వరకు విస్తరించింది. ఒకే చెట్టు ఇంత పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది? అంత పెద్దదిగా ఎలా పెరిగింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెజిల్ లోని పిరంగి డో నార్టే ప్రాంతంలో ఉన్న ఈ భారీ జీడి చెట్టును స్థానికంగా ‘మైయోర్ కాజుయిరో డో ముండో’ అని పిలుస్తారు. పోర్చుగీస్‌లో దీని అర్థం ప్రపంచంలోనే అతిపెద్ద జీడి చెట్టు. దీని విస్తీర్ణం సుమారు 8,500 చదరపు మీటర్లు. ఈ చెట్టు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఈ చెట్టు ప్రత్యేకత దాని కొమ్మల్లో దాగి ఉంది. సాధారణంగా చెట్టు కొమ్మలు పైకి లేదంటే పక్కలకు విస్తరిస్తాయి. కానీ, ఈ జీడి చెట్టు కొమ్మలు క్రమంగా నేల వైపు వంగి పెరుగుతాయి. నేలను తాకిన కొన్ని కొమ్మలు అక్కడే వేళ్లు పాతుకుంటాయి. ఆ తర్వాత అవి కొత్త కాండాల్లా మారి, తిరిగి అసలు చెట్టుతోలింకై ఉంటాయి. దీంతో చెట్టు ఒకే కాండంతో ఉన్న సాధారణ వృక్షంలా కాకుండా, ఎన్నో కాండాలు కలిగిన భారీ చెట్టుగా కనిపిస్తుంది.
8,500 చదరపు మీటర్ల విస్తీర్ణం అంటే సాధారణంగా ఊహించడానికి కూడా కష్టమే. ఒక ఫుట్ బాల్ మైదానం కంటే ఎక్కువ ప్రాంతాన్ని ఈ జీడి చెట్టు ఆక్రమించింది. చెట్టు కొమ్మలు అన్ని వైపులా విస్తరించి, పైన భారీ పందిరిని ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం ప్రత్యేకమైన సహజ దృశ్యంగా మారింది. చెట్టు కింద నడుస్తుంటే ఒక భారీ పచ్చని సొరంగంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని అక్కడికి వచ్చే సందర్శకులు చెబుతారు. ఈ భారీ జీడి చెట్టు ఇప్పుడు పర్నమిరిమ్ ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా మారింది. దీనిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు.
ప్రకృతి ఎంత వైవిధ్యంగా ఉంటుందో చూపించే అద్భుతమైన ఎగ్జాంఫుల్ గా నిలిచింది ఈ చెట్టు. సాధారణంగా చెట్లను ఎత్తు, వయసు ఆధారంగా చూస్తాం. కానీ, బ్రెజిల్‌లోని ఈ జీడి చెట్టు మాత్రం తన విస్తీర్ణంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక చిన్న జీడి చెట్టు కొమ్మ నేలను తాకడం నుంచి ప్రారంభమైన ఈ చెట్టు విస్తరణ, కాలక్రమంలో వేల చదరపు మీటర్లకు విస్తరించిన అద్భుతంగా మారింది. అందుకే ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు.. ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు.
Read Also: దేశంలోనే తొలి రెడ్ రోడ్.. దట్టమైన అడవిలో దీన్ని ఎందుకు వెశారో తెలిస్తే షాకవ్వాల్సిందే!