Mount Kailash Mysteries Secrets, Myths and Scientific Facts: కైలాస మానస సరోవరం.. ఇక్కడికి వెళ్లడమంటే దాదాపు స్వర్గానికి వెళ్లి వచ్చినట్లే అని హిందువులు విశ్వసిస్తారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అక్కడ కొలువై ఉన్నాడని భావిస్తారు. అందుకే.. ఈ యాత్రకు ఎక్కడా లేనంత డిమాండ్ ఉంది. అయితే, ఒకప్పుడు ఇక్కడికి వెళ్లాలి అంటే భారత విదేశాంగ శాఖ లాటరీ నిర్వహించేది. 50 మంది చొప్పున ఏడాదికి 18 బ్యాచ్‌లను అక్కడికి తీసుకెళ్లేది. అక్కడికి వెళ్లి రావడానికి సుమారు 21 రోజుల సమయం పట్టేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆ యాత్ర సాహసోపేతమైనదో. ఇదంతా ఆధ్యాత్మికంగా ఒక వైపు. కానీ, ఆ కైలాస పర్వతానికి సంబంధించి ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం.
కైలాస పర్వతాన్ని దూరం నుంచి చూసినప్పుడు త్రిభుజాకారంలో.. అంటే పిరమిడ్ రూపంలో కనిపిస్తుంది. అంతేకాదు.. నలుదిక్కుల నుంచి చూసినా సమానంగా అదే ఆకారంలో కనిపిస్తుంది. అందుకే, చాలామంది ఇది సహజంగా ఏర్పడిన పర్వతం కాదని, ఎవరో నిర్మించి ఉంటారని అంటుంటారు. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. భౌగోళికంగా పర్వతాల్లో ఇలాంటి ప్రత్యేక ఆకారాలు ఏర్పడటం సహజమే అని అంటున్నారు. మంచు, గాలి, నీటి ప్రవహం వల్ల ఏర్పడిన కోతలు, రాతి పొరల నిర్మాణం వల్ల ఆ పర్వతానికి అలాంటి ఆకారం వచ్చి ఉంటుందని అంటున్నారు. ఈ పర్వతాన్ని కృత్రిమంగా నిర్మించారని చెప్పేందుకు తగిన ఆధారాలు కూడా లేవు.
అక్కడికి వెళ్లే భక్తులు ఒక వింత అనుభూతి ఏర్పడుతుంది. శివుడి ధ్యాసలో మునిగి ఉండేవారికి.. ఆ పర్వతంలోని కొన్ని కోణాల్లో ఓం, స్వస్తిక్ ఆకారాలు కనిపిస్తుంటాయని అంటారు. అక్కడికి వెళ్లిన చాలామంది యాత్రికులు ఈ విషయాన్ని చెప్పారు. శాస్త్రీయంగా చూస్తే.. అవి సహజ రాతి నిర్మాణాలని, మంచు పేరుకుపోవడం, సూర్యకాంతి, నీడల వల్ల అలాంటి ఆకారాలు కనిపించి ఉండవచ్చని భావిస్తుంటారు. పైగా అక్కడ శివుడి ధ్యాసలో వెళ్లినవారికి అలా కనిపిస్తూ ఉండవచ్చని అంటారు. కానీ, అది నిజంగా దైవానుగ్రహం అయితే? అనుకుంటూ.. భక్తులు ఆ అనుభూతిని పదిలంగా దాచుకుంటారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8,848.86 మీటర్లు. దీన్ని ఇప్పటికే ఎంతోమంది అధిరోహించారు. కానీ, 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరూ అధిరోహించలేదు. చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా ఆ ప్రయత్నం చేయలేకపోయారు. దీనికి కారణం ఆ పర్వతానికి ఉన్న అతీంద్రియ శక్తులే అని అంటారు. ఏదో అదృశ్య శక్తి ఆ పర్వతాన్ని కాపాడుతోందని నమ్ముతున్నారు. మరికొందరు మాత్రం అక్కడి భౌగోళిక పరిస్థితులు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా లేకపోవడమే అని అంటారు. కానీ, ఎవరికీ ఆ పర్వతం అధిరోహించాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇందుకు మతపరమైన ఆంక్షలే కారణమా?
కైలాస పర్వతం వద్ద ఓంకారం వినిపిస్తుందని పలువురు భక్తులు వెల్లడించారు. కొందరైతే డమరుకం మోగినట్లు, కొన్ని గంభీరమైన ధ్వనులు వినిపించినట్లు చెబుతారు. ఇదంతా అక్కడి అతీంద్రియ శక్తుల వల్లేనని, పరమేశ్వరుడే స్వయంగా భక్తులను ఆవిధంగా ఆశీర్వదిస్తున్నారని నమ్ముతారు. కానీ, శాస్త్రీయంగా పర్వత ప్రాంతాల్లోని బలమైన గాలులు, మంచు కదలికలు, రాళ్ల కదలికలు, లోయల్లో నుంచి వచ్చే రీసౌండ్స్ వల్ల కూడా ఆ వింత శబ్దాలు వచ్చి ఉండవచ్చనే భావన ఉంది.
కైలాస మానస సరోవరం యాత్ర అంటే ఒక్కటే కాదు. కైలాస పర్వతానికి సమీపంలో ఉన్న మానస సరోవర్, రాక్షస తాల్ కూడా ఇందులో భాగం. మన హిందూ సాంప్రదాయాల్లో మానస సరోవరాన్ని అత్యంత పవిత్రమైన సరస్సుగా భావిస్తారు. అయితే, రాక్షస తాల్‌కు భిన్నమైనది. దీన్నే రావణ హ్రదం అని కూడా అంటారు. పురాణాల ప్రకారం.. రావణాసురుడు పరమ శివుడి అనుగ్రహం కోసం ఈ సరస్సు వద్ద ఘోర తపస్సు చేశాడని నమ్ముతారు. అందుకే దానికి రావణ తాల్ లేదా రాక్షస తాల్ అని పేరు వచ్చింది. మానససరోవరం దేవతలకు సాత్విక గుణాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ సరస్సు సూర్యుడిలా గుండ్రంగా, రాక్షస తాల్ అర్ధచంద్రాకారంలో ఉంటాయి. మరో చిత్రం ఏమిటంటే.. మానస సరోవరం మంచి నీటి సరస్సు.. దానికి కూతవేటు దూరంలో ఉన్న రావణ తాల్ మాత్రం ఉప్పునీటి సరస్సు. అందులో కనీసం జీవులు కూడా ఉండవు. అందుకే దాన్ని నెగటివ్ ఎనర్జీగా భావిస్తారు.
కైలాస యాత్రకు వెళ్లినవారికి.. కొన్ని వింత అనుభూతులు ఎదురవుతాయి. అక్కడి సమయం సాధారణం కంటే వేగంగా గడిచినట్లు అనిపిస్తుందట. జుట్టు, గోళ్లు చాలా వేగంగా పెరుగుతాయని కొందరు యాత్రికులు వెల్లడించారు. మరికొందరికైతే కాలం ఆగిపోయినట్లుగా లేదా నెమ్మదించినట్లుగా అనిపిస్తుందట. ఇలా భిన్న విధాలుగా భక్తులు తమ అనుభూతిని తెలియజేస్తుంటారు. కానీ, దాని వెనుక దాగిన మిస్టరీ ఏమిటనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు. అయితే, దీనికి శాస్త్రీయం ఎలాంటి ఆధారం లేదు. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల వారికి అలాంటి అనుభూతి కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read: మానస సరోవరానికి ఇండియా నుంచి ఎన్నో రూట్లు.. కానీ, నేపాల్ మీదుగానే ప్రయాణమెందుకు?
కైలాసం అనగానే మనకు గుర్తుకు వచ్చే మరో విషయం శంభాల నగరం. టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల్లో ఈ నగరం గురించి అనేక కథలు ఉన్నాయి. ఇది ఒక ఆధ్యాత్మిక రాజ్యంగా అందులో పేర్కొన్నారు. వాటిలో కైలాసం కింద ఉన్న రహస్య నగరాలు, సొరంగాలు గురించి పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు అవేవీ బయటపడలేదు. దీంతో అక్కడ ఏదో మాంత్రిక శక్తి ఉండవచ్చని భావిస్తుంటారు.