Train Theft Attempt: తల్లి మరణం తర్వాత ఆమె చివరి కోరికను తీర్చేందుకు, కుటుంబసభ్యులతో కలిసి హరిద్వార్ వెళ్తున్న ఆ వ్యక్తికి.. రైలు ప్రయాణంలో అర్ధరాత్రి అనుకోని ఘటన ఎదురైంది. చోరీకి వచ్చిన దుండగులు ఏకంగా చితాభస్మాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత దేవేంద్ర ఇనాని ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 8న ఆయన తన తల్లి రామకన్య ఇనాని (85) అనారోగ్య కారణాల రీత్యా కన్నుమూశారు. దీనితో ఆయన, మరికొంతమంది కుటుంబసభ్యుల చితాభస్మం తీసుకొని హరిద్వార్‌కు ప్రయాణమయ్యారు. అప్పుడు జరిగిందే ఈ ఘటన. అసలేం జరిగిందంటే..?
ఇండోర్‌లోని లక్ష్మీబాయి నగర్ స్టేషన్ లో ఎక్కిన బీజేపీ నేత దేవేంద్ర బృందం ఎస్-2 బోగీలో ప్రయాణిస్తోంది. దేవేంద్ర ఇనాని, మొత్తం 9 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. అయితే జూలై 21 తెల్లవారుజామున 4 గంటల సమయంలో, ట్రైన్ మొరేణా – ఆగ్రా కాంట్ స్టేషన్ల మధ్య వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి పక్కనే ఉన్న ఎస్-4 బోగీ నుంచి వచ్చి, ఇనానీ వారి సంచి తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో దేవేంద్ర ఇనాని నిద్రలేచి, ఆ వ్యక్తిని వెంటనే పట్టేశారు.
ఇనాని వెంటనే ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మిగతా ప్రయాణికులు కూడా లేచి, గుమిగూడారు. దొంగ ప్రయాణికులకు చిక్కకుండా వెళ్లేందుకు ప్లాన్ వేసినా, ఆ సంచి అంటే చితాభస్మం గల సంచిని మాత్రం ఇనాని వదలలేదు. అందులో ఆయన తల్లి రామకన్య చితాభస్మంతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యుల చితాభస్మం కూడా ఉంది. అంత పవిత్రమైన సంచిని దొంగతనం చేయాలనుకోవడమే ఇక్కడ సంచలనం.
దీనికి తోడు, ప్రయాణికులు ట్రైన్‌లో ఓ వాష్‌రూమ్‌లో సోదా చేసి, 2 ఖాళీ పర్సులు బయటపెట్టారు. అంతేకాదు, ఓ ప్రయాణికుడు తన మొబైల్ కనిపించకుండా పోయిందని చెప్పారు. ఆ తరువాత ట్రైన్ లోపలే ఎక్కడో దొంగ మొబైల్ ఫోన్‌ను బయటకు విసిరేసినట్టు అర్థమైంది. ఈ సంఘటనలన్నింటినీ జోడిస్తే.. ఇది ముందే ప్లాన్ చేసిన దొంగతనమేనన్న అనుమానం మరింత బలపడింది.
Also Read: Train cancellation list: ప్రయాణికులకు బిగ్ షాక్.. 26 రైళ్లు రద్దు.. మీ ట్రైన్ ఉందేమో చెక్ చేసుకోండి!
దొంగను వెంటనే ట్రైన్ ఆగే ఆగ్రా కాంట్ స్టేషన్‌కి తీసుకెళ్లి, అక్కడి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)కి అప్పగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి గ్వాలియర్‌కు చెందినవాడిగా గుర్తించారు. అతడి గురించి పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. గతంలోనూ ఇతనిపై కేసులున్నాయా అనే విషయాలపై విచారణ చేస్తున్నారు.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ యజమాని మాత్రం ట్రైన్ దిగిపోయి అక్కడే మిగిలి అధికారికంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాడు. మిగతా ప్రయాణికులు మాత్రం ప్రయాణాన్ని కొనసాగించారు. ఇనాని కుటుంబం సోమవారం హరిద్వార్ చేరుకుని, మంగళవారం తల్లి సహా ఇతర కుటుంబ సభ్యుల చితాభస్మంను పవిత్ర గంగా నదిలో కలిపారు. కానీ దేవేంద్ర ఇనాని చూపిన జాగ్రత్త, ధైర్యం వల్లే ఆ సంచి సురక్షితంగా ఉండి తల్లి చివరి కోరికను నెరవేర్చగలిగారు. ఆయన ధైర్యానికి ప్రయాణికులు కూడా అభినందనలు తెలిపారు.
ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆ దొంగను ప్రయాణికులు పక్కకు నెట్టుతూ పట్టుకుని, పోలీసులకు అప్పగించే దృశ్యాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు రైలు ప్రయాణంలో తలెత్తితే, ప్రయాణికులందరికీ అప్రమత్తత అవసరం. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించటం, అనుమానాస్పద వ్యక్తులను పట్టించుకోవటం ఇప్పుడు తప్పనిసరి. దేవేంద్ర ఇనాని చేసిన పని కేవలం తన కుటుంబాన్ని కాపాడడమే కాదు.. ఇతర ప్రయాణికుల ఆస్తులు, జాగ్రత్తలు రక్షించడానికీ ఆదర్శంగా నిలుస్తోందని ప్రయాణికులు తెలిపారు.