Big Tv Originals: ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది భారతీయ రైల్వే. రోజూ లక్షలాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతుంది. అదే సమయంలో కొంత మందికి ఉచితంగా, మరికొంత మందికి రాయితీ ప్రయాణాన్ని అందిస్తోంది. దేశానికి సేవ చేసిన వారికి, పలు రకాల ఇబ్బందులో బాధపడుతున్న వారికి సపోర్టుగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఇంతకీ రైళ్లలో ఎవరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు? ఏ నిబంధలన ప్రకారం ఫ్రీ జర్నీ సదుపాయాన్ని పొందవచ్చు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారత రైల్వేలో ఎవరు ఉచితంగా ప్రయాణించవచ్చు?
⦿ స్వతంత్ర సమరయోధులు
దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి భారతీయ రైల్వే ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది. వారు స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్, AC కంపార్ట్ మెంట్లలో ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా ప్రయాణించవచ్చు. వారి జీవిత భాగస్వాములు, వితంతువులు కూడా ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన వారికి ప్రభుత్వం నుంచి కృతజ్ఞతగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు.
⦿ రైల్వే ఉద్యోగులు
ప్రస్తుత, పదవీ విరమణ చేసిన రైల్వే ఉద్యోగులు రైల్వే ప్రివిలేజ్ పాస్ ద్వారా ఉచిత ప్రయాణించే అవకాశం ఉంటుంది. వారి సర్వీస్ ర్యాంక్ ను బట్టి, స్లీపర్ క్లాస్, AC కంపార్ట్ మెంట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించవచ్చు. ఈ పాస్‌లు ఏటా జారీ చేయబడతాయి. రైల్వే ఉద్యోగుల జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వీటిని ఉపయోగించవచ్చు.
⦿ 5 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
ఇక 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు రైల్వే ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నది. అయితే, టికెట్ కొనుగోలు చేయకపోతే వారికి ప్రత్యేక సీటు లేదంటే బెర్త్ కేటాయించబడదు. ఈ రాయితీ కుటుంబాలకు, ముఖ్యంగా సుదూర ప్రయాణాల సమయంలో ప్రయాణ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.
⦿ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారులు
న్యాయమూర్తులు, సీనియర్ బ్యూరో క్రాట్స్ తో సహా ప్రభుత్వ అధికారులు అధికారిక విధుల్లో ఉన్నప్పుడు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారికి ప్రత్యేక డ్యూటీ పాస్‌లు జారీ చేయబడతాయి. ఇవి వారికి కేటాయించిన ప్రయాణ సమయంలోనే చెల్లుబాటు అవుతాయి.
⦿ పార్లమెంటు సభ్యులు
సిట్టింగ్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మొదటి AC, ఎగ్జిక్యూటివ్ తరగతిలో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అదనంగా, వారు తమతో ఒక వ్యక్తిని తీసుకెళ్లడానికి అనుమతించబడతారు. ఈ ప్రయోజనం ఎంపీలు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలు కల్పిస్తుంది.
రాయితీ, ఉచిత ప్రయాణం పొందే ప్రత్యేక వర్గాలు
⦿ రోగులు
క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఉచిత లదేంటే భారీగా రాయితీ ప్రయాణానికి అర్హులు. తరచుగా, రోగితో పాటు వెళ్లే ఒక ఎస్కార్ట్ కూడా అదే ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ రాయితీ వైద్య చికిత్స కోసం ప్రయాణించే వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
⦿ యుద్ధ వితంతువులు, శౌర్య అవార్డు విజేతలు
సైనికులు చేసిన త్యాగాలను గౌరవించేందుకు యుద్ధ వితంతువులు, శౌర్య అవార్డు విజేతలకు ఉచిత ప్రయాణం అందించబడుతుంది. ఇందులో పరమ వీర చక్ర, అశోక చక్ర వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, వారిపై ఆధారపడిన వారు కూడా ఉన్నారు.
⦿ క్రీడాకారులు, జాతీయ అవార్డు గ్రహీతలు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడా ప్రముఖులు, అలాగే అర్జున అవార్డు వంటి అవార్డుల గ్రహీతలు ఉచిత, రాయితీ ప్రయాణాన్ని పొందుతారు. ఇది అథ్లెట్లు, క్రీడాకారుల విజయాలను ప్రోత్సహిస్తుంది.
⦿ సీనియర్ సిటిజన్లు
సీనియర్ సిటిజన్లు పాక్షిక రాయితీలకు అర్హులు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు 40% తగ్గింపు, 58 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు టికెట్ ఛార్జీపై 50% రాయితీ పొందుతారు.
ఉచిత ప్రయాణం కోసం మార్గదర్శకాలు
డాక్యుమెంటేషన్: ఉచిత, రాయితీ ప్రయాణాన్ని పొందే ప్రయాణీకులు వారి అర్హతను బట్టి రైల్వే పాస్, సీనియర్ సిటిజన్ ఐడి లేదంటే వైద్య ధృవీకరణ పత్రం లాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను తీసుకెళ్లాలి.
కోటా వ్యవస్థ: స్వతంత్ర సమరయోధులు, సీనియర్ సిటిజన్లు, రోగులకు టికెట్ లభ్యతను నిర్ధారించడానికి నిర్దిష్ట కోటాల కింద సీట్లు కేటాయించబడతాయి.
బుకింగ్ అవసరాలు: కొన్ని పాస్‌లు ప్రయాణీకులను నేరుగా ఎక్కేందుకు అనుమతిస్తాయి. మరికొన్నింటికి ఆన్ లైన్‌లో, రైల్వే కౌంటర్లలో ముందస్తు టికెట్ బుకింగ్ అవసరం కావచ్చు.
కఠిన చర్యలు: ఉచిత ప్రయాణ ప్రయోజనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి కఠినమైన నియమాలు అమలులో ఉన్నాయి. ఉల్లంఘించినవారు జరిమానాలు, ప్రత్యేక హక్కుల రద్దుతో పాటు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Read Also: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయకూడదు!