Begunkodar Railway Station: దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల మీదుగా రోజూ 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. కోట్లాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తున్నారు. వేలాది మంది రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఓ రైల్వే స్టేషన్ పేరు వింటే, ప్రయాణీకులతో పాటు రైల్వే ఉద్యోగులు భయంతో వణికిపోతారు. అక్కడి పని చేసేందుకు ఏ రైల్వే ఉద్యోగి ముందుకురారు. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా వెళ్లినా ప్రాణాలతో ఉండేవాళ్లు కాదు. ఈ చావులకు కారణం ఓ దయ్యం అని, రైల్వే స్టేషన్ కు వచ్చే వారిని పగబట్టి చంపేస్తుందనే ప్రచారం ఉంది. చివరకు ఓ ఘోస్ట్ రైల్వే స్టేషన్ గా ముద్ర వేసుకుంది. అక్కడ పని చేసేందుకు ఉద్యోగులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూతపడింది. ఇంతకీ ఈ స్టేషన్ ఎక్కడ ఉంది? ఎందుకు దెయ్యం స్టేషన్ గా గుర్తింపు పొందాల్సి వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బేగుంకోదర్ రైల్వే స్టేషన్ వెనుక అసలు కథ
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లో ఉంది. పురిలియా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది ఈ బేగుంకోదర్ రైల్వే స్టేషన్. ఇండియన్ రైల్వే సైతం తన రికార్డులలోనూ దీనిని హాంటెడ్ స్టేషన్ గా పేర్కొన్నది. ఈ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి తెల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ దర్శనం ఇస్తుందని, ఆ దయ్యమే చాలా మంది ప్రాణాలు తీసిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కారణంగా గత 42 ఏండ్లుగా మూతబడింది. ఇప్పటికీ రాత్రిపూట ఈ రైల్వే స్టేషన్ వైపు వెళ్లాలంటేనే భయపడతారు.
1960లో బేగుంకోదర్ రైల్వే స్టేషన్ నిర్మాణం
ఈ రైల్వే స్టేషన్ ను 1960లో నిర్మించారు. స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణాలు కొనసాగించేవారు. తమ సరుకులను రవాణా చేసుకునే వారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, ఈ స్టేషన్ లో ఓ ఆడ దయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలయ్యింది. రైలు పట్టాల మీద నడుచుకుంటూ వస్తున్న మహిళా దయ్యాన్ని చూసి ఈ రైల్వే స్టేషన్ మాస్టర్ చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను రైల్వే అధికారులు తొలుత కొట్టిపారేశారు. కానీ, ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ కుటుంబ సభ్యులు సైతం అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో ప్రజల్లో భయం పెరిగింది.
స్టేషన్ ను మళ్లీ తెరిపించాలని భావించినా..
ఈ రైల్వే స్టేషన్ లో పని చేసేందుకు ఉద్యోగులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ మూతపడింది. ఇక మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయ్యాక 2009లో ఈ స్టేషన్ ను మళ్లీ తెరిపించారు. అయితే, సాయంత్రం 5 తర్వాత ఈ స్టేషన్ లో ఎవరూ ఉండేవారు కాదు. ఈ మరణాల వెనుక మిస్టరీని కనిపెట్టేందుకు కొంత మంది హేతువాదులు ప్రయత్నించారు. ఓ రోజు రాత్రిస్టేషన్ లోనే బస చేశారు. పర్యాటకులను దోచుకోవడానికి కొంత మంది స్థానికులు దెయ్యం ఉందనే ప్రచారం చేశారని తేల్చారు. అయినప్పటికీ, ఇక్కడ పని చేయాలంటే రైల్వే ఉద్యోగులు భయపడతారు. ఈ స్టేషన్ లో పెద్దగా రైళ్లు కూడా ఆగవు.
Read Also: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఏకబిగిన అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?