Longest Route Vande Bharat Express: భారతీయ రైల్వే సంస్థ గత దశాబ్ద కాలంగా గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. రైల్వే స్టేషన్ల నుంచి మొదలుకొని రైళ్ల వరకు అద్భుతంగా రూపొందుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకప్పుడు రోజుల తరబడి కొనసాగే రైలు ప్రయాణం, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకతో గంటల్లో పూర్తవుతున్నది. దేశంలోని ప్రధాన నగరాలను ఈ రైళ్లు గంటల వ్యవధిలో చేరుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు సుమారు 500 కిలో మీటర్ల దూరం ఉన్న రూట్లలో నడుస్తున్నాయి.
దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఓ రైలు అత్యంత దూరం ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 1000 కిలో మీటర్ల మేర ఏక బిగిన ప్రయాణం చేస్తున్నది. ఇంతకీ ఆ రైలు మరేదో కాదు, ఢిల్లీ-పాట్నా వందేభారత్ ఎక్స్ ప్రెస్. దేశంలోని రెండు ప్రధాన నగరాల నడుమ సేవలు అందించే ఈ రైలు భారత్ లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు నగరాల మధ్య 994 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ రైలు ఒకసారి ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత.. ఏకంగా 11.30 గంటల పాటు జర్నీ చేస్తుంది.
వారానికి ఎన్నిసార్లు ప్రయాణిస్తుందంటే?
ఢిల్లీ-పాట్నా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ట్రయిల్ బేసిస్ లో పట్టాలెక్కింది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం నడుస్తుంది. అటు పాట్నా నుంచి సోమవారం, గురువారం, శనివారం బయల్దేరుతుంది. ఇక ఢిల్లీ నుంచి ఈ రైలు ఉదయం 8.25 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 8 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. అటు పాట్నా నుంచి తర్వాత రోజు ఉదయం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 7 గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
Read Also: డబ్బులు లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇండియన్ రైల్వే సూపర్ సర్వీస్ గురించి మీకు తెలుసా?
టికెట్ ధరలు ఎలా ఉంటాయంటే?
ఇక ఈ వందేభారత్ రైల్లో ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 2,575గా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 4,655గా ఉంది. ఇక ఈ రైలు కాన్పూర్, ప్రయాగరాజ్, దీన్ దయల్ ఉపాధ్యాయ్ జంక్షన్, బుక్సార్, అరా జంక్షన్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుంది. గత ఏడాది అక్టోబర్ 30న ఈ రైలు పట్టాలెక్కింది. ఇక త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతున్నది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు ఈ రైలు ప్రయాణం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ఢిల్లీ-శ్రీనగర్ కోసం ప్రత్యేకమైన వందేభారత్ స్లీపర్ ను రూపొందించారు.