Bhadrachalam Rail Project: భద్రాద్రి శ్రీరామ భక్తులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాండురంగపురం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు భద్రాచలం మీదుగా కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. సుమారు 173 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి దాదాపు రూ.2,900 కోట్ల వ్యయంతో నిర్మించనుంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రస్తుతం రైలు మార్గం నేరుగా అందుబాటులో లేకపోవడంతో కొంత దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. కొత్త రైల్వే లైన్ పూర్తయితే ఈ ఇబ్బంది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు బస్సులో వెళ్లాల్సిన సుమారు 40 కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీంతో భక్తులు నేరుగా రైలు ద్వారా భద్రాచలం చేరుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఈ కొత్త మార్గాన్ని హైస్పీడ్ రైళ్లకు అనువుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం చేరుకునే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. 2032 నాటికి ఈ మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. కొత్త రైల్వే మార్గం వెళ్లే ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ స్టేషన్లు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు రైల్వే సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు కొత్త కనెక్టివిటీ రావడంతో స్థానికంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారం, పర్యాటకం, ఉపాధి రంగాల్లో కూడా దీని ప్రభావం కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో గోదావరి నదిపై నిర్మించనున్న రైల్వే వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజమండ్రి ప్రాంతంలోని గోదావరి వంతెనను పోలిన స్థాయిలో భారీ వంతెన నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో పాటు రైల్వే మార్గంలో వందలాది చిన్న, పెద్ద వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించాల్సి ఉంటుంది. కొండలు, అడవులు లాంటి భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
ఈ రైల్వే మార్గం కేవలం ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు కూడా కీలకంగా మారనుంది. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించడంలో కొత్త మార్గం ఉపయోగపడే అవకాశం ఉంది. బొగ్గు రవాణా వేగం పెరగడంతో సరుకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఓవరాల్ గా భద్రాచలానికి నేరుగా రైల్వే కనెక్టివిటీ కల్పించే ఈ ప్రాజెక్టు భక్తులతో పాటు స్థానిక ప్రజలకు, వ్యాపార రంగానికి, పారిశ్రామిక అవసరాలకు కూడా ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. 2032 నాటికి పనులు పూర్తయితే భద్రాచలం ప్రాంత రవాణా వ్యవస్థలో కీలక మార్పుగా నిలవనుంది.
Read Also: జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!