Nuclear-Powered Green Hydrogen: క్లీన్ ఫ్యూయల్ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. తమిళనాడులోని కల్పక్కంలో అణుశక్తిని ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో భారత గ్రీన్ ఫ్యూయల్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అణుశక్తి, హైడ్రోజన్ ఉత్పత్తిని కలిపి ఉపయోగించాలనే ఆలోచనకు ప్రపంచం ఫిదా అవుతోంది. అదే సమయంలో కల్పక్కం ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతోంది.
భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC) ఆధ్వర్యంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. సాధారణంగా నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలంటే పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. కల్పక్కం ప్రాజెక్టులో మాత్రం అణు రియాక్టర్ల నుంచి లభించే ఉష్ణశక్తిని ఉపయోగించుకునే విధానంపై దృష్టి పెట్టారు. అంటే విద్యుత్‌తో పాటు రియాక్టర్ నుంచి వచ్చే వేడిని కూడా హైడ్రోజన్ తయారీలో వినియోగించుకోవచ్చు.
నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ అనే రెండు మూలకాలు ఉంటాయి. ప్రత్యేక సాంకేతిక ప్రక్రియల ద్వారా వీటిని వేరు చేసి హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను పరిశ్రమలు, రవాణా, విద్యుత్ రంగాల్లో భవిష్యత్తులో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ కీలక పాత్ర పోషించగలదని నిపుణులు భావిస్తున్నారు.
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతి లేదా గాలి అందుబాటులో ఉన్నప్పుడే వాటి నుంచి విద్యుత్‌ను పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. అణు విద్యుత్ కేంద్రాలకు మాత్రం ఈ పరిమితి తక్కువ. అవి నిరంతరంగా పనిచేయగలగడంతో హైడ్రోజన్ ఉత్పత్తి ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనుంది. అంటే, రోజులో 24 గంటలూ హైడ్రోజన్ తయారీకి అవకాశం ఉంటుంది.
హైడ్రోజన్‌ను పర్యావరణహిత ఇంధనంగా అభివృద్ధి చేయడంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, అణు రియాక్టర్ నుంచి లభించే వేడిని కూడా ఉపయోగించడం ద్వారా ఈ ఖర్చును తగ్గించాలన్నది ఈ విధానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. హైడ్రోజన్ ఉత్పత్తి సమయంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కూడా మరో కీలక ప్రయోజనం. అయితే మొత్తం వ్యవస్థ ఎంతవరకు ఖర్చుతో కూడుకున్నది, కమర్షియల్ గా ఎంత సమర్థంగా పనిచేస్తుంది అనే అంశాలపై త్వరలో క్లారిటీ రానుంది.
స్వచ్ఛమైన ఇంధన రంగంలో భారత్ ఇప్పటికే సౌర, పవన విద్యుత్‌పై భారీగా దృష్టి పెట్టింది. ఇప్పుడు అణుశక్తితో హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తే దేశ ఇంధన రంగానికి మరో ప్రత్యామ్నాయం లభించినట్టే అవుతుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను పెద్ద స్థాయిలో అమలు చేయగలిగితే పరిశ్రమలు, రవాణా రంగంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగం పెరగవచ్చు. దీంతో దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, హైడ్రోజన్ రంగంలో భారత్‌కు అంతర్జాతీయంగా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
Read Also: రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!