IRCTC password reset: రైల్వే టిక్కెట్ బుక్ చేయాలంటే ముందు గుర్తొచ్చేది IRCTC వెబ్‌సైట్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 2002లో ప్రారంభమై, అప్పటి నుంచి కోట్లాది మంది ప్రయాణికులకు టికెట్ బుకింగ్, క్యాటరింగ్, ప్యాకేజీ టూర్ల వంటి వాటిలో ఉపయోగపడుతోంది. స్టేషన్‌లో క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే కష్టాన్ని తప్పించాలంటే IRCTC ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఒక వరం.
గత కొన్ని సంవత్సరాల్లో, ఏజెంట్లు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేయకుండా ఉండేందుకు IRCTC చాలా కఠినమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. దాంతో సామాన్య ప్రయాణికులకు కూడా సులభంగా టికెట్ లభించే పరిస్థితి ఏర్పడింది.
అయితే, మరీ ముఖ్యంగా అనేకమంది ప్రయాణికులు ఎదుర్కొనే సాధారణ సమస్య ఒకటి ఉంది. అదే IRCTC పాస్‌వర్డ్ మర్చిపోవడం. మీరు టికెట్ బుక్ చేయబోతూ లాగిన్ అవ్వాలని చూస్తుంటే, పాస్‌వర్డ్ గుర్తు లేదన్న ఆలోచన రావడం సహజం. అలాంటి సమయంలో మీరు ఏమి చేయాలి? మీరు చిటికెలో ఎలా పాస్‌వర్డ్ మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
❂ పాస్‌వర్డ్ రీసెట్ ప్రక్రియ చాలా ఈజీ!
IRCTC అకౌంట్ పాస్‌వర్డ్ మార్చుకోవడం పెద్ద పని కాదు. మీరు కేవలం కొన్ని నిమిషాల్లోనే మళ్లీ మీ అకౌంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే తప్పక ఇలా చేయాలి. మొదటగా IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఉన్న ఫేవరెట్ బ్రౌజర్‌లో https://www.irctc.co.in అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. స్క్రీన్ మీదపై కుడి వైపు ఉన్న మూడు గీతల మెనూ (☰) పై క్లిక్ చేయండి. అక్కడ Login అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి. అక్కడే Forgot account details పై క్లిక్ చేయండి. ఇప్పుడు Login పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Forgot account details అనే లింక్ పై క్లిక్ చేయండి.
దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ యూజర్‌నేమ్ లేదా ఈమెయిల్ టైప్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన యూజర్ నేమ్ లేదా ఈమెయిల్ ID అక్కడ టైప్ చేయాలి. తర్వాత కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Next బటన్ క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చే వరకు వేచి ఉండండి.
మీరు ఇచ్చిన వివరాలు సరైనవైతే, మీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీను టైప్ చేసి కొత్త పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. ఇక మరోసారి క్యాప్చా ఎంటర్ చేసి ‘Update Password’ అనే ఆరెంజ్ రంగు బటన్ క్లిక్ చేయండి. అంతే.. పాస్‌వర్డ్ రీసెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ IRCTC హోం పేజీకి వెళ్లి, కొత్త పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఇక మీరు టికెట్ బుక్ చేయడానికి సిద్ధం!
❂ ఇలా కూడా చేయండి
పాస్‌వర్డ్ మళ్లీ మర్చిపోకుండా సేఫ్ నోట్‌లో, బ్రౌజర్‌లో సేవ్ చేసుకోవచ్చు. పాస్‌వర్డ్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండడం మంచిది. పాస్‌వర్డ్‌లో అక్షరాలు, అంకెలు, స్పెషల్ కేరెక్టర్లు (@, #, $, etc) కలిపి వాడితే మరింత సురక్షితం. IRCTC ఖాతాలో మీ ప్రయాణ సమాచారం, పేమెంట్ డిటెయిల్స్ ఉండటం వల్ల పాస్‌వర్డ్ భద్రత చాలా ముఖ్యం. ఎవరితోనూ పాస్‌వర్డ్ పంచుకోకండి. ఫేక్ మెసేజ్‌లు, నకిలీ IRCTC లింకులు వంటివి వచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త!
మీరు టికెట్ బుక్ చేయడానికి హడావుడిగా వెబ్‌సైట్ ఓపెన్ చేసినపుడు పాస్‌వర్డ్ మర్చిపోయా అనే ఆలోచన వచ్చిందా? భయపడాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన విధంగా కేవలం 2 నిమిషాల్లో మీరు కొత్త పాస్‌వర్డ్‌తో తిరిగి లాగిన్ కావచ్చు. ఇప్పుడు మీ IRCTC అకౌంట్‌కి మరోసారి యాక్సెస్ పొందండి.. మళ్లీ మీ ట్రైన్ జర్నీకై మీ బుకింగ్ మొదలు పెట్టండి!