Indian Hydrogen Train Speed: భారతీయ రైల్వేలో మరో కీలక ముందడుగు పడబోతోంది. ఇప్పటి వరకు విద్యుత్, డీజిల్ రైళ్లను చూస్తున్న ప్రయాణికులకు త్వరలో హైడ్రోజన్ తో నడిచే రైలు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించనుంది. దేశంలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన హైడ్రోజన్ రైలు ఇకపై గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ రైలు స్పీడ్ టెస్ట్ సక్సెస్ అయ్యింది.
హైడ్రోజన్ రైలు ఇప్పటికే 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్స్ పూర్తి చేసింది. అయితే జింద్–సోనిపట్ మార్గంలో ప్రస్తుతం దీని ఆపరేషనల్ వేగాన్ని 75 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రైలు డిజైన్ మాత్రం గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. భవిష్యత్తులో వేగాన్ని పెంచే అవకాశాలను రైల్వే పరిశీలిస్తోంది.
సాధారణ ఎలక్ట్రిక్ రైళ్లు ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల నుంచి పవర్ తీసుకుంటాయి. కానీ, హైడ్రోజన్ రైలుకు అలాంటి విద్యుత్ సరఫరాపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రైలులో ఏర్పాటు చేసిన ఫ్యూయల్ సెల్ వ్యవస్థలో హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌తో రైలు మోటార్లు పనిచేస్తాయి. ఈ ప్రక్రియలో ప్రధాన ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. పొగ, దహనం, టెయిల్‌పైప్ కార్బన్ ఉద్గారాలు ఉండవు.
తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును 2026 జూలై 17న హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ప్రారంభించారు. ఈ మార్గం సుమారు 89 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని హైడ్రోజన్ రైలు సాంకేతికత, భద్రత, నిర్వహణ సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉన్నాయి. హైడ్రోజన్ నిల్వ, ఫ్యూయల్ సెల్ వ్యవస్థ, బ్యాటరీలు, భద్రతా పరికరాలు ఇందులో కీలకంగా పనిచేస్తాయి. జింద్‌లో హైడ్రోజన్‌ను నిల్వ చేయడం, రైలుకు ఇంధనం నింపడం కోసం ప్రత్యేక సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
హైడ్రోజన్ రైలును భవిష్యత్తులో ఏయే మార్గాల్లో నడపవచ్చనే దానిపై రైల్వే అధికారులు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. రైలు నడిచే ప్రాంతాల్లో హైడ్రోజన్ లభ్యత, రీఫ్యూయలింగ్ సదుపాయాలు, సాంకేతిక అవసరాలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇదే సమయంలో భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా వేగంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం హౌరా–కామాఖ్య మధ్య తొలి వందే భారత్ స్లీపర్ నడుస్తోంది. మరో నాలుగు రైళ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మరో 11 వందే భారత్ స్లీపర్ రైళ్లు రైల్వేకు అందనున్నాయి. PPP విధానంలో 200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కూడా కొనసాగుతోంది.
Read Also: ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!