Best Weekend Places Near Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో చాలామందికి ఒకటే ఆలోచన. రెండు రోజులు హాయిగా ఎంజాయ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లాలి. కానీ, ఎక్కువ రోజులు సెలవు తీసుకోవడం కుదరదు. దూరంగా వెళ్లాలంటే ఖర్చు, ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. అందుకే హైదరాబాద్‌కు దగ్గర్లోనే ఉండే వీకెండ్ స్పాట్స్ ఇప్పుడు చాలామందికి బెస్ట్ ఆప్షన్‌గా మారుతున్నాయి. ఫ్రెండ్స్ తో కలిసి కారులో బయలుదేరి, దారిలో సరదాగా ఆగుతూ, ఫొటోలు తీసుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ వస్తే ట్రిప్ మరింత ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుంది. అలాంటి ఐదు స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ నుంచి త్వరగా వెళ్లి రావాలనుకునే వారికి అనంతగిరి హిల్స్ బెస్ట్ ఆప్షన్. సిటీకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం పచ్చని అడవులు, కొండలు, ట్రెక్కింగ్ మార్గాలతో ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో ఉదయాన్నే బయలుదేరితే ఒక రోజులోనే ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. ఉదయం చల్లటి వాతావరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది.
హిస్టరీతో పాటు అడ్వెంచర్‌ను ఇష్టపడే వారికి భువనగిరి కోట మంచి డెస్టినేషన్. ఎత్తైన కొండపై ఉన్న ఈ కోటకు వెళ్లే ప్రయాణమే కొంత ఆసక్తికరంగా ఉంటుంది. కోట పైకి చేరుకున్న తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల వ్యూ ఫ్రెండ్స్ తో కలిసి చూడటానికి బాగుంటుంది. ఒక చిన్న రోడ్ ట్రిప్‌తో చారిత్రక ప్రదేశాన్ని చూసొచ్చే అవకాశం ఉండటంతో వీకెండ్ ప్లాన్‌కు సెట్ అవుతుంది.
ప్రకృతిని ఇష్టపడే వారికి పోచారం మరో మంచి ఆప్షన్. హైదరాబాద్‌కు దగ్గర్లోనే ఉండే ఈ ప్రాంతంలో రిజర్వాయర్, పచ్చని పరిసరాలు, పక్షులను చూసే అవకాశం ఉన్నాయి. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ప్రశాంతంగా కొంత సమయం గడపడానికి బాగుంటుంది. ముఖ్యంగా నగరంలోని హడావుడి నుంచి కాస్త దూరంగా వెళ్లాలనుకునేవారికి నచ్చే ప్రదేశం.
కొంచెం ఆఫ్ బీట్ గా ఉండే ప్రదేశం కావాలనుకుంటే రాచకొండ కోటను ట్రై చేయొచ్చు. చారిత్రక ప్రాధాన్యతతో పాటు కొండలు, రాళ్ల మధ్య ఉండే పరిసరాలు ఫొటోగ్రఫీకి కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఫ్రెండ్స్ తో కలిసి ఉదయం బయలుదేరి ప్రకృతి, చరిత్ర రెండింటినీ ఆస్వాదిస్తూ ఒక రోజు గడపొచ్చు.
వీకెండ్‌ను ప్రకృతి మధ్య గడపాలనుకునేవారికి మల్లెల తీర్థం మరో మంచి ఆప్షన్. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలం తర్వాత మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జలపాతం, అడవి వాతావరణం, ప్రయాణంలో కనిపించే ప్రకృతి దృశ్యాలు కలిసి ఫ్రెండ్స్ తో మంచి ట్రిప్ అనుభూతిని ఇస్తాయి.
ఈ ప్రదేశాల్లో కొన్ని వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తాయి. అయితే బయలుదేరే ముందు వాతావరణ పరిస్థితులు, రోడ్డు పరిస్థితులు, విజిటింగ్ టైమింగ్స్ లాంటి విషయాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కారెక్కితే, ఆ మజానే వేరుగా ఉంటుంది!
Read Also: 11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!