Uppada Sea Erosion:సముద్రం కోతతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.అవును ..తీరానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు మొదలుపెట్టింది. తీర రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది.రక్షణ గోడను ఎక్కడ నిర్మించాలి? ఎంత పొడవు ఉండాలి? సముద్రపు అలల తీవ్రతను తట్టుకునేలా ఎలాంటి నిర్మాణం చేపట్టాలి? అనే అంశాలపై అధికారులు, నిపుణులు దృష్టి పెట్టారు.
ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణుల బృందం
ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో సర్వే ప్రారంభించింది. ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల టీమ్ తీర ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్ సర్వే చేపడుతున్నారు. డ్రోన్ల ద్వారా తీరం మొత్తాన్ని పై నుంచి పరిశీలించి బీచ్ పరిస్థితిని అంచనా వేస్తున్నారు .
ఎక్కడ సముద్రం కోత ఎక్కువగా ఉంది? ఏ ప్రాంతంలో తీర రేఖ మారుతోంది? సముద్రపు అలలు ఏ దిశగా ప్రభావం చూపుతున్నాయి? వంటి వివరాలను సేకరిస్తున్నారు.
వివరాల ఆధారంగానే రక్షణ గోడ డిజైన్
తీర ప్రాంతంలో కేవలం పైపైగా పరిశీలన చేయడం కాకుండా.. అక్కడి ఇసుక, మట్టి పరిస్థితులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీరం వెంట వివిధ ప్రాంతాల నుంచి ఇసుక, మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. వాటిని పరీక్షలకు పంపించి భూమి స్వభావం ఎలా ఉంటుంది,ఇసుక ఎలా కదులుతుంది,సముద్రపు ప్రభావం ఏమైనా ఉంటుందా వంటి విషయాలను అంచనా వేయనున్నారు. ఈ వివరాల ఆధారంగానే రక్షణ గోడ డిజైన్‌ను రూపొందించనున్నారు.
ఉప్పాడలో సముద్రం కోత సమస్య చాలాకాలంగా కొనసాగుతోందన్న సంగతి తెల్సిందే.ప్రతీ ఏడూ సముద్రం కొంతకొంతగా ముందుకు రావడంతో భయం గుప్పిట్లో బతుకుతున్నారు తీరప్రాంత ప్రజలు.
మరో వైపు తీర భూమి తగ్గిపోవడంతో ఇళ్లు, రోడ్లు, వంటి వాటిపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సర్వే కీలకంగా మారిందనే చెప్పాలి.. ఐఐటీ మద్రాస్ నిపుణుల అధ్యయనం పూర్తయిన తర్వాత రక్షణ గోడ అలైన్‌మెంట్‌ను ఓకే చేయనున్నారట.
దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా
అదే సమయంలో డీపీఆర్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచనున్నారు. నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? గోడ నిర్మాణం ఎన్ని దశల్లో చేపట్టాలి? ఎలాంటి నిర్మాణ విధానం ఉపయోగించాలి? వంటి అంశాలపై స్పష్టత తీసుకురానున్నారు.
భవిష్యత్‌లో మళ్లీ సమస్యలు రాకుండా దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా రక్షణ గోడను రూపొందించడమే లక్ష్యంగా పని చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు పర్యావరణ అనుమతుల విషయంలో కూడా ఆలస్యం జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. డిజైన్, డీపీఆర్ పనులు జరుగుతున్న సమయంలోనే అవసరమైన పర్యావరణ అనుమతుల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్రక్రియలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
ఉప్పాడ ప్రజలకు ఊరట
మొత్తానికి ఉప్పాడ తీరానికి రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం ఇప్పుడు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఐఐటీ మద్రాస్ నిపుణుల సర్వే, డ్రోన్ మ్యాపింగ్, మట్టి-ఇసుక నమూనాల పరీక్షలు పూర్తయిన తర్వాత రక్షణ గోడకు ఒక రూపం రానుందని సమాచారం .
Also read :రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!
ఆ తర్వాత డీపీఆర్, పర్యావరణ అనుమతులు, నిర్మాణ పనుల దిశగా అడుగులు పడనున్నాయి. మొత్తానికి ఏళ్లుగా సముద్రం కోతతో ఇబ్బందులు పడుతున్న ఉప్పాడ ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ఇలా ఊరట లభించనుందన్న మాట !