Special Train from Charlapalli: ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. సాధారణంగా అయితే సంక్రాంతి, దసరా పండుగల సమయంలో ఈ రైళ్లను నడుపుతారు. అయితే ఈ సారి కూడా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నామంటూ వేసవి కాలంలో దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను ఎర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు వెళ్లనున్నాయి. అయితే వారాంతాల్లో మాత్రమే ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
0857 నంబర్ ట్రైన్ ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏప్రిల్ 25 నుంచి వచ్చే నెల 30 వరకు రాకపోకలను కొనసాగిస్తుంది. చర్లపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే 08580 నంబర్ రైలు ఈ నెల 26 నుంచి మే 31 వరకు ప్రయాణాలు కొనసాగించనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయట.
చర్లపల్లి – విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఈ రైళ్లు పలు స్టేషన్లలో ఆగుతూ వెళ్తాయి. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
కాగా, ప్రయాణికుల రద్దీ, అవసరాలకు అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రైన్స్ నడుపుంతుంది. అలాగే సంక్రాంతికి కూడా చర్లపల్లి నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లను నడిపింది. సంక్రాంతి సమయంలో, చర్లపల్లి నుండి విశాఖకు ప్రత్యేక రైళ్లు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 7 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు విశాఖకు చేరుకునేవి. కానీ ఈ సారి మాత్రం వారాంతాల్లో మాత్రమే రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.