Ashwini Vaishnaw About General Coaches: తక్కువ ఖర్చుతో చక్కటి ప్రయాణం చేసేందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రజలకు ఎక్కువగా జనరల్ బోగీల్లో వెళ్తుంటారు. కానీ, ఎక్కువ రద్దీ, సీట్ల కొరత కారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సామాన్య ప్రయాణీకులకు పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. జనరల్ కోచ్ ల సంఖ్య భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ చివరి నాటికి 1000 జనరల్ కోచ్ లు
దేశ వ్యాప్తంగా 370 రైళ్లకు 1000 అదనపు జనరల్ కోచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడంచారు. డిసెంబర్ 2024 చివరి నాటికి వెయ్యి అదనపు జనరల్ కోచ్ లను యాడ్ చేస్తామని పార్లమెంట్ లో వెల్లడించారు. గత మూడు నెలల్లో 600లకు పైగా జనరల్ కోచ్ లను రైళ్లకు అటాచ్ చేసినట్లు చెప్పారు. ఈ ఏర్పాటుతో రోజూ లక్ష మంది ప్రయాణీకులు జనరల్ కోచ్ లో వెళ్లే అవకాశం కలిగిందన్నారు. వచ్చే 2 సంవత్సరాలలో నాన్ ఏసీ కేటగిరీకి చెందిన 10 వేలకు పైగా అదనపు జనరల్ కోచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ప్రయాణీకులకు మెరుగైన సేవలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త జనరల్ కోచ్ లు అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో సామాన్య ప్రయాణీకులు ట్రైన్ జర్నీ చేసే అవకాశం ఉంటుందన్నారు.
వచ్చే 2 ఏండ్లలో 10 వేల జనరల్ బోగాల ఏర్పాటు
ఈ ఏడాది చివరల్లోగా 1000 జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించి రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్.. వచ్చే రెండు సంవత్సరాల్లో 10 వేల జనరల్ బోగీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. “వచ్చే రెండు సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ కోచ్ లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. సాధారణ ప్రయాణీకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. రైలు ప్రయాణం చేసే వారికి ఎక్కువ మంది సామాన్య ప్రయాణీకులే ఉన్నారు. వారికి అదనపు సౌకర్యాలు కల్పించే విషయంపై ఫోకస్ పెట్టాం. వచ్చే రెండు ఏండ్లలో 10 వేలకు పైగా జనరల్ బోగీలను రైళ్లకు యాడ్ చేస్తాం. వీటిలో 6 వేల జనరల్ కోచ్ లు కాగా, మిగతావి స్లీపర్ క్లాస్ కోచ్ లు. ఇవి అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ప్రయాణీకులు జనరల్ క్లాస్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి
అటు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద 1,300 స్టేషన్లను పునరుద్ధరిస్తోందన్నారు. ఇందుకోసం సుమారు రూ.700-800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మరికొన్నింటిని రూ.100-200 కోట్లతో పునర్నించనున్నట్లు తెలిపారు. మొత్తం భారతీయ రైల్వే నెట్ వర్క్ లోని రైల్వే స్టేషన్లను సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: తెలంగాణలోని ఈ ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!