USBRL Project Update: భారత్ కు తలమాణికం అయిన జమ్మూ కాశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ రైలు సర్వీసులు ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన తుది తేదీని నిర్ణయించనప్పటికీ, జనవరిలో ఓపెన్ కానున్నట్లు తెలుస్తున్నది. ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సమాచారం. సోనామార్గ్ ను కాశ్మీర్ లోని కంగన్ పట్టణంతో కలిపే 6.5 కిలోమీటర్ల రెండు-లేన్ల రహదారి టన్నెల్ ను కూడా ఆయన ఓపెన్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తున్నది.
కత్రా-రియాసి సెక్షన్ లో ట్రయల్ రన్ సక్సెస్
ఇక తాజాగా ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు మార్గంలోని కత్రా-రియాసి సెక్షన్ ను రైల్వే భద్రతా కమిషనర్ జనవరి 5న తుది తనిఖీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ రైల్వే లైను ప్రారంభంకానుంది. వచ్చే నెలలో రైలు సర్వీసులు ప్రారంభం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా కత్రా- రియాసీ సెక్షన్ లో సుమారు 17 కిలో మీటర్ల మేర కార్గో రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాలేదని అధికారులు తెలిపారు. తొలిసారి నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు ప్రకటించారు.
USBRL ట్రాక్ నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించిన రైల్వేమంత్రి
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ లో ట్రాక్ నిర్మాణం పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. “భారతీయ రైల్వే చరిత్రలో ఇదో చారిత్రక మైలురాయి. ఉధంపూర్- శ్రీనగర్ -బారాముల్లా రైలు లింక్ పై చివరి ట్రాక్ పనులు పూర్తయ్యాయి. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం దిగువన, కత్రా నుంచి రియాసిని కలుపుతూ 3.2 కి.మీ పొడవున్న టన్నెల్ T-33 కోసం బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ పని విజయవంతంగా పూర్తయింది” అని ఎక్స్ వేదిగా తెలిపారు.
ఐదు స్లీపర్ రైళ్లు, ఓ చైర్ కార్ రైలు
ఇక న్యూఢిల్లీ-జమ్మూకాశ్మీర్ నడుమ నడిచే 5 వందేభారత్ స్లీపర్ రైళ్లతో పాటు చైర్ కార్లతో కూడిన ఓ వందేభారత్ రైలును ప్రత్యేకంగా తయారు చేశారు. జమ్మూకాశ్మీర్ లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందించారు. మంచు, చలిని తట్టుకుని దూసుకెళ్లేలా ప్రత్యేక ఫీచర్లు ఇన్ స్టాల్ చేశారు. ఈ రైళ్లలో విమానంలో మాదిరిగా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక జమ్మూకాశ్మీర్ వెళ్లే రైళ్లకు సంబంధించి బోర్డింగ్ స్టేషన్లలో విమానాశ్రయం తరహా భద్రతా తనిఖీలతో నిర్వహించనున్నారు. ప్రయాణీకులతో పాటు రైళ్ల భద్రతకు రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కాశ్మీర్‌కు రైళ్లు
తెలంగాణలో సికింద్రాబాద్ లేదా కొత్తగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ లేదా విశాఖపట్నం నుంచి పలు రైళ్లు జమ్మూకాశ్మీర్ కు నడపనున్నట్లు తెలుస్తున్నది. సౌత్ సెంట్రల్ రైల్వే ఈ రైళ్లకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: ఆ రైల్వే స్టేషన్‌లో ఎయిర్ పోర్ట్ తరహా భద్రతా తనిఖీలు.. చిన్న పిన్ను దొరికినా..