Big Tv Originals: ఏసీ కోచ్ లో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. రైల్వే దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు దొంగతనంగా ఇంటికి తీసుకెళ్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. గత కొద్ది కాలంగా రైల్లోని దుప్పట్లను తీసుకెళ్తూ పలువురు పట్టుబడిన నేపథ్యంలో రైల్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రైల్లోని వస్తువులను తీసుకెళ్లడం చట్టప్రకారం నేరమని, ఉల్లంఘిస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.
ప్రయాణ సమయంలో ఉపయోగించుకునేందుకే..
సాధారణంగా 1A, 2A, 3Aతో సహా AC క్లాసులలో ప్రయాణించే వారికి దుప్పట్లు, బెడ్ షీట్లు. టవల్స్ అందిస్తారు. వాటిని ప్రయాణ సమయంలో మాత్రమే ఉపయోగించేందుకు అందిస్తారు. కొంత మంది వాటిని దొంగతనంగా తీసుకెళ్లడం ఎక్కువ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే స్పందించింది. ఈ వస్తువులు ప్రయాణీకుల అవసరాల కోసం మాత్రమే ఉద్దేశించబడినవని, వాటిని తీసుకెళ్లడం వల్ల రైల్వే మీద అదనపు భారం పడుతుందని వెల్లడించింది.
దుప్పట్లు దొంగిలిస్తూ దొరికితే?
దుప్పట్లు, బెడ్ షీట్లు దొంగతనంగా తీసుకెళ్తూ దొరికితే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఎంత ఫైన్ విధించాలి? అనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఆయా వస్తువులకు అయ్యే ఖర్చును వసూళు చేసే అవకాశం ఉంటుంది. దుప్పటికి రూ. 200 నుంచి రూ. 300, దిండు లేదంటే బెడ్ షీట్ కు రూ. 100 నుంచి 150 వసూళు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ దొంగతనం చేసే ప్రయాణీకులు జరిమానాను చెల్లించేందుకు నిరాకరిస్తే, రైల్వే చట్టం 1989 ప్రకారం జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
రైల్వే చట్టం సెక్షన్ 141 ఏం చెప్తుంది?
రైల్వే చట్టంలోని సెక్షన్ 141 ప్రకారం.. రైల్వే వస్తువులను దొంగిలించడం, అనధికారికంగా ఉపయోగించడం నేరం. అలా చేయడం వల్ల జరిమానా విధించబడుతుంది. కొన్నిసార్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. చాలా వరకు జరిమానాతోనే ఈ కేసులను క్లోజ్ చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. జరిమానా కట్టేందుకు ఒప్పుకోకపోతే పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని వెల్లడించారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించండి!
సో, ప్రయాణీకులు రైల్వేకు సంబంధించిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగిలించకూడదు. రైలు దిగే ముందు దుప్పట్లు, దిండ్లను కోచ్ సిబ్బందికి తిరిగి ఇవ్వండి. మీరు అనుకోకుండా ఏదైనా తీసుకుంటే.. సిబ్బందికి చెప్పండి. నెక్ట్స్ స్టేషన్ వాటిని తిరిగి ఇవ్వండి. ప్రయాణీకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రైల్వే సూచించింది. ప్రజా వనరులను దుర్వినియోగం చేయకూడదని విజ్ఞప్తి చేసింది. “ప్రజా రవాణాలో ప్రయాణీకుల కోసం ఉపయోగించే వస్తువులను ఎవరూ ఇంటికి తీసుకెళ్లకూడదు. అలా చేయడం వల్ల రైల్వే మీద అదనపు భారం పడుతుంది. ప్రయాణీకులు బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని ఇండియన్ రైల్వే సూచించింది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.
Read Also: రైల్లో అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే ఇలా చెయ్యండి.. ప్రాణాలు దక్కుతాయ్!