IRCTC Ticket Refund Policy: ఓ రైల్వే ప్రయాణీకుడు రూ. 35 రీఫండ్ కోసం చేసిన పోరాటంలో చివరకు విజయం సాధించాడు. తాను గెలవడమే కాదు, సుమారు 3 లక్షల మంది రైల్వే ప్రయాణీకులకు లాభం కలిగేలా చేశాడు. ముందు రూ. 35 రీఫండ్ చేసేందుకు నో చెప్పిన రైల్వే సంస్థ చివరకు ఏకంగా రూ. 2.43 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాల్సి వచ్చింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రాజస్థాన్ లోని కోటాకు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ 2017లో ఏప్రిల్ లో గోల్డెన్ టెంపుల్ రైళ్లో న్యూఢిల్లీకి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అదే ఏడాది జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కొన్ని కారణాలతో ఆయన టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూ. 765 పెట్టి టికెట్ బుక్ చేసుకోగా, క్లరికల్ చార్జీ కింద రూ.65, జీఎస్టీ రూ.35 కట్ చేసుకుని రైల్వే సంస్థ రూ.665 రిఫండ్ చేసింది. తాను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు జీఎస్టీ లేదని, అలాంటప్పుడు రూ. 35 ఎందుకు కట్ చేశారో చెప్పాలని లేఖ రాశారు. తన రూ. 35 రీఫండ్ ఇవ్వాలని కోరారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏకంగా 50 దరఖాస్తులు చేశాడు. నాలుగు కేంద్ర ప్రభుత్వ శాఖలకు లెటర్స్ రాశాడు. తనకు రీఫండ్ ఇవ్వాలంటూ ప్రధాని, రైల్వే, ఆర్థిక మంత్రులకు, జీఎస్టీ కౌన్సిల్ కు సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేశారు. సుజీత్ స్వామి పోరాటానికి రైల్వేశాఖ దిగొచ్చింది. ఏకంగా 2.98 లక్షల మంది IRCTC వినియోగదారులకు మొత్తం రూ. 2.43 కోట్లు రీఫండ్ అందించేందుకు అంగీకరించింది.
రైల్వేశాఖ ఏం చెప్పిందంటే?
సుజీత్ స్వామి RTI ప్రశ్నకు రైల్వేశాఖ కీలక విషయాలు వెల్లడించింది. కమర్షియల్ సర్క్యులర్ నంబర్. 43ని కోట్ చేస్తూ.. GST అమలుకు ముందు బుక్ చేసిన, GST అమలు తర్వాత రద్దు చేయబడిన టిక్కెట్లకు బుకింగ్ సమయంలో వసూలు చేసిన సేవా పన్ను తిరిగి చెల్లించబడదని వెల్లడించింది. క్యాన్సిల్ చేసిన టిక్కెట్‌పై రూ. 100 (రూ. 65 క్లరికల్ ఫీజు మరియు రూ. 35 సేవా పన్ను) వసూలు చేయబడింది. అయితే, జూలై 1, 2017లోపు బుక్ చేసుకున్న, రద్దు చేసిన టిక్కెట్‌లకు, బుకింగ్ సమయంలో విధించిన సేవా పన్ను మొత్తం తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.
రీఫండ్ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే?
రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తే కొన్ని మినహాయింపులతో రీఫండ్ ఇస్తారు. రైల్వే టిక్కెట్ బుకింగ్ సర్వీస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి, దేశంలో జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత, దానిపై పన్ను విధించడం ప్రారంభమైంది.
⦿ మీరు వెయిటింగ్, RAC టిక్కెట్‌ను తిరిగి ఇస్తే, కమర్షియల్ సర్క్యులర్ 43 ప్రకారం, టిక్కెట్ బుకింగ్ సమయంలో వసూలు చేసిన సేవా పన్ను తిరిగి చెల్లించబడదు.
⦿ రైలు బయలుదేరే 48 గంటల ముందు కన్ఫర్మ్ చేసిన టికెట్‌ను రద్దు చేస్తే జనరల్ క్లాస్‌లో రూ.60, స్లీపర్‌లో రూ.120, ఏసీ చైర్‌కార్‌లో రూ.120, థర్డ్ ఏసీలో రూ.180, సెకండ్ ఏసీలో రూ.200, రూ.200 క్యాన్సిలేషన్ ఛార్జీ ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడి నుంచి ఫస్ట్ క్లాస్‌లో రూ. 240 వసూలు చేస్తారు.
⦿ రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే, 25% ఛార్జీ మినహాయించబడుతుంది, అయితే రైలు బయలుదేరే 4 గంటలలోపు రద్దు చేస్తే, 50% తీసివేయబడుతుంది.
⦿ రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వెయిటింగ్ లిస్ట్, RAC టిక్కెట్‌ను రద్దు చేయకపోతే ఎలాంటి రీఫండ్ ఇవ్వదు.
Read Also: ఈ యాప్ జోలికి అస్సలు వెళ్లకండి, రైల్వే ప్రయాణీకులకు IRCTC వార్నింగ్!