Indian Railways: జమ్మూకాశ్మీర్ సమగ్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రైల్వే కనెక్టివిటీని మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రతిష్టాత్మకమైన ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నది. జమ్మూ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసింది. త్వరలోనే ప్రధాని మోడీ ఈ రైల్వే డివిజన్ ను ప్రారంభించనున్నారు. మరోవైపు జమ్మూ నుంచి శ్రీనగర్ కు మూడు రైళ్లను ప్రకటించింది. ఇందులో ఒకటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉండగా, రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వందేభారత్ రైలు జమ్మూ నుంచి శ్రీనగర్ కు కేవలం 3 గంటల 10 నిమిషాలు చేరుకోనుండగా, మిగతా రెండు రైళ్లు 3 గంటల 20 నిమిషాల్లో చేరుకుంటాయి. ఈ రైళ్లు శీతాకాల పరిస్థితులను తట్టుకుని నడిచేలా రూపొందిస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఇప్పటికే 3 రైలు సర్వీసులు ఉండగా, ఇప్పుడు మరో మూడు రైళ్లు వాటితో చేరనున్నాయి.
మూడు రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల
తాజాగా ఈ మూడు రైళ్లకు సంబంధించి టైమ్ టేబుళ్లను రైల్వే సంస్థ విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పకనే చెప్పింది. తాజాగా టైమ్ టేబుల్ ప్రకారం.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 8:10 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా(SVDK) నుంచి బయల్దేరి 11:20 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇదే రైలు తిరిగి శ్రీనగర్ నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3:55 గంటలకు SDVK చేరుకుంటుంది. మిగతా రెండు రైళ్లు కూడా రోజూ రౌండ్ ట్రిప్పులు వేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
శీతాకాల పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల నిర్మాణం
జమ్మూ-శ్రీనగర్ నడుమ అందుబాటులోకి రానున్న మూడు రైళ్లు పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైళ్లు. ఇవి కాశ్మీర్ లోయలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణం మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా శీతాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైలు ప్రయాణం కొనసాగేలా తగు ఏర్పాట్లు చేశారు. కాశ్మీర్ లో వ్యాలీలో ప్రస్తుతం నడుస్తున్న విస్టాడోమ్ తో సహా ఆరు రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు జమ్మూలో రైల్వే కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు జమ్మూ రైల్వే డివిజన్ ఏర్పాట్లు చేశారు. దీన్ని ప్రధాని మోడీ సోమవారం(జనవరి 6న) నాడు ప్రారంభించనున్నారు.
180 కిలో మీటర్లతో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్ వెర్షన్
ఇక త్వరలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ వెర్షన్ రైలు ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుపుకుంటున్నది. తాజాగా స్పీడ్ టెస్ట్ కు సంబంధించిన వీడియోను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ రైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తూ కనినిపించింది. వందేభారత్ స్లీపర్ రైలు గత మూడు రోజుల్లో పలు ట్రయల్స్ లో గరిష్ట వేగాన్ని అందుకుందని రైల్వే సంస్థ వెల్లడించింది. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. తొలి వందేభారత్ స్లీపర్ వెర్షన్ న్యూఢిల్లీ- శ్రీనగర్ నడుమ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది.
Read Also: జస్ట్ 13 గంటల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం ఎప్పుడంటే!