Delhi to Srinagar Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వందేభారత్.. త్వరలో సరికొత్త వెర్షన్ లో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఇకపై దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి నేరుగా కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు ఈ రైలు పరుగులు తీయనుంది. ఇకపై యావత్ దేశానికి జమ్మూకాశ్మీర్ కనెక్టివిటీ పెరగనుంది. ఈ కొత్త రైలు సర్వీసు వచ్చే ఏడాది(2025) జనవరిలో ప్రారంభం కానున్నాయి. కాశ్మీర్ లోయతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలన మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ రైలు సేవలు షురూ కానున్నాయి.
సుదూర ప్రయాణాల కోసం వందేభారత్ స్లీపర్ రైలు
వందే భారత్ స్లీపర్ రైలు సుదూర రాత్రిపూట ప్రయాణం కోసం డిజైన్ చేశారు. అద్భుతమైన కాశ్మీర్ లోయకు వేగవంతమైన, సరసమైన ప్రయాణ ఎంపికను అందించనుంది ఈ రైలు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలుకు సంబంధించిన మోడల్ ను సెప్టెంబర్ 2024లో ఆవిష్కరించారు. ఈ రైలును BEML తయారు చేసింది.
కేవలం 13 గంటల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు..
వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం అయిన తర్వాత ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి కాశ్మీర్ లోయకు వెళ్లడానికి 20 గంటల సమయం పడుతుంది. ఈ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం 13 గంటల్లో జర్నీ కంప్లీట్ కానుంది. ఈ రైలు ప్రారంభం తర్వాత జమ్మూకాశ్మీర్ పర్యటకరంగం మరింత అభివృద్ధి చెందనుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. అంతేకాదు, దేశం అంతటితో కనెక్టివిటీ పెరగనుంది.
న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ స్లీపర్ రైలు గురించి..
దూరం, ప్రయాణ సమయం: న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ కు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBHL) ప్రాజెక్టు ద్వారా వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణించనుంది. మొత్తం 800 కిలో మీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 13 గంటల్లో పూర్తి చేయనుంది.
షెడ్యూల్, స్టాప్‌లు: వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 7:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. మార్గంలో అంబాలా కాంట్ జంక్షన్, లూథియానా జంక్షన్, కథువా, జమ్ము తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, సంగల్దాన్, బనిహాల్ లాంటి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
టిక్కెట్ ధర: వందేభారత్ స్లీపర్ రైలులో మూడు రకాల క్లాసులు ఉన్నాయి. AC 3 టైర్ (3A), AC 2 టైర్ (2A), AC ఫస్ట్ క్లాస్ (1A). టికెట్ ధరలు 3Aకి సుమారుగా రూ. 2,000, 2Aకి రూ. 2,500, 1Aకి రూ. 3,000 గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ రైలు మార్గం ద్వారా ప్రయాణించే న్యూఢిల్లీ-శ్రీనగర్ వందేభారత్ స్లీపర్ రైలు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించనుంది.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1,036 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, సాలరీ ఎంతో తెలుసా?