Katra-Srinagar Rail Link Inauguration: దేశ వ్యాప్తంగా ప్రజలు, పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా-రైల్ ప్రాజెక్ట్ (USBRL) ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 19న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి, అంజి ఖాడ్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను జెండా ఊపి సర్వీసులను ప్రారంభించాలని అధికారులు షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత కాత్రాలో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఆ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభోత్సవం?
ఏప్రిల్ 19 నుంచి 22 వరకు జమ్మూకాశ్మీర్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీనాబ్ రైల్వే బ్రిడ్జి, అంజి ఖాడ్ వంతెనను సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత కత్రా నుంచి శ్రీనగర్ ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించాల్సి ఉంటుంది. వీటి కోసం రెండు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశాం. కానీ ఏప్రిల్ 19 నుంచి 22 వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే, ఈ పర్యటన వాయిదా పడింది. ప్రారంభోత్సవానికి సంబంధించి కొత్త డేట్ ను త్వరలో ప్రకటిస్తాం. ఏప్రిల్ చివరి వారంలో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది” అని అధికారులు వెల్లడించారు. జమ్మూ- కాశ్మీర్ లో వచ్చే వారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నెరవేరనున్న కాశ్మీర్ ప్రజల చిరకాల వాంఛ
దశాబ్దాలుగా కశ్మీర్ లోయకు భారత్ లోని ఇతర భూభాగాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు సంగల్దాన్–బారాముల్లా సెక్షన్ వరకే వస్తాయి. సుదూర సర్వీస్ రైళ్లు కత్రా వరకు నడుస్తాయి. త్వరలో రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కశ్మీర్ లోయ ప్రాంత వాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను పొందే అవకాశం ఉంటుంది. కాశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీని పెంచడంలో ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ కీలక పాత్ర పోషించనుంది. ఈ రైల్వే లింక్ ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన రైల్వే లింక్ గా గుర్తింపు తెచ్చున్నది. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ అద్భుతమైన రైల్వే బ్రిడ్జిలు, టన్నెల్స్ ద్వారా ఈ రైల్వే లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకున్న చీనాబ్ రైల్వే బ్రిడ్జి కూడా ఇదే లైన్ లో ఉంది. కత్రా-రియాసి నడుమ ఏర్పాటు చేసిన రైల్వే కేబుల్ బ్రిడ్జి కూడా భారతీయ ఇంజినీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. ఈ రైల్వే లైన్ ప్రారంభం అయిన తర్వాత కాశ్మీర్ కు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతం పర్యాటకంగా, ఆర్థికంగా బలోపేతం కానుంది. అటు సమ్మర్ వెకేషన్ కోసం కాశ్మీర్ లోయకు వెళ్లేందుకు పర్యాటకులు రెడీ అవుతున్నారు.
Read Also: ప్రయాణీకులకు మట్టి కుండల్లో మంచి నీళ్లు, వేసవి వేళ రైల్వే కీలక నిర్ణయం!