Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణీకల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్యాసింజర్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంప్రదాయ పద్దతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ తమిళనాడు అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధురై రైల్వే డివిజన్ వ్యాప్తంగా రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు హైడ్రేటెడ్ గా ఉండేందుకు కీలక ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రధాన స్టేషన్లలో సాంప్రదాయ మట్టి కుండల్లో తాగునీటిని అందుబాటులో ఉంచింది.
ప్రధాన రైల్వే స్టేషన్లలో మట్టి కుండల్లో మంచి నీళ్లు
వేసవిలో ఫ్రిజ్ నీళ్లు తాగడం కంటే మట్టి కుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు. మట్టి కుండలు సహజ శీతలీలకరణ లక్షణాలను కలిగి ఉండడంతో పాటు నీళ్లలోని మినరల్స్ కు ఎలాంటి హాని కలిగించవు. వేసవిలో కుండలో నీళ్లు తాగితే హైడ్రేటెడ్ గా ఉంటారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని మధురై డిజవిజన్ పరిధిలోని కరైకుడి, పళని, దిండిగల్, మధురై, మన మధరై, తిరునెల్వేలి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో మట్టి కుండల్లో నీటి వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. ప్రయాణీకులు అందరికీ అందుబాటులో ఉండేలా రైల్వే స్టేషన్లలో పలు చోట్ల మట్టి కుండల్లో నీళ్లను ఏర్పాటు చేశారు. ఖాళీ అయిన కుండలను నింపేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు శ్రేయస్సే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ఇక రైలు ప్రయాణంలోనూ డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ప్రయాణీకుల విజ్ఞప్తితో మట్టి కుండల ఏర్పాటు
ఎండలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అత్యంత రద్దీగా ఉండే టెర్మినల్స్‌లో ఒకటైన మధురై జంక్షన్‌లో సరైన తాగు నీటి సౌకర్యాలు లేక ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. రైల్వే స్టేషన్ ఎంట్రీలో కాకుండా ప్లాట్ ఫారమ్ లో ఎక్కడా మంచి నీళ్లు తాగే అవకాశం లేదని డివిజన్ అధికారులకు పలువురు ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మట్టి కుండల్లో మంచి నీళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. “ప్రయాణీకుల నుంచి మాకు నీటి సదుపాయం లేదనే ఫిర్యాదు వచ్చింది. ఈ నేపథ్యంలో మధురై డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల ఎంట్రీ పాయింట్లతో పాటు ప్లాట్ ఫారమ్ లలోనూ మట్టి కుండల్లో మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఈ నిర్ణయం పట్ల ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ప్రయాణీకుల వినియోగం పెరగడం వల్ల, కొన్ని కుండలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మధురై పరిధిలోని ఇతర రద్దీ స్టేషన్లలో అదనపు కుండలను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాము. ఖాళీ అయిన కుండలను నింపేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశాం” అని రైల్వే అధికారులు వెల్లడించారు. అటు వేసవి తాపం నుంచి తట్టుకునేలా మంచి నీటి కుండలను ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆ రూట్లలో పెరగనున్న రైళ్ల వేగం, గంటకు అన్ని కిలో మీటర్లా?