Kodaikanal Online Ticket Booking: తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కోడైకనాల్కు వెళ్లాలనుకునే వారికి అటవీ శాఖ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమయంలో పర్యాటకుల రద్దీని, వాహనాల ట్రాఫిక్ను తగ్గించేందుకు కీలకమైన పర్యాటక ప్రదేశాల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పర్యాటకులు అక్కడికి వెళ్లే ముందే ఇంటి నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో పర్యాటక ప్రాంతాల ఎంట్రెన్స్ ల దగ్గర ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
దిండిగల్ జిల్లాలో ఉన్న కోడైకనాల్ పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి చల్లని వాతావరణం, పచ్చని అడవులు, ప్రకృతి అందాలను చూసేందుకు సెలవుల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ మెయింటెనెన్స్ లో ఉన్న నాలుగు ప్రముఖ ప్రదేశాల్లో ఆన్లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. పిల్లర్ రాక్స్, గుణ గుహలు, పైన్ ఫారెస్ట్, మోయిర్ పాయింట్లకు వెళ్లే పర్యాటకులు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
పర్యాటకులు https://kodaikanalwildlifesanctuary.com/ వెబ్సైట్ ద్వారా ఎంట్రీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో టికెట్ ధర చెల్లించిన తర్వాత డిజిటల్ రిసీట్ లేదంటే ప్రింట్ తీసుకున్న రసీదును చూపించి పర్యాటక ప్రాంతాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కోడైకనాల్కు చేరుకున్న తర్వాత టికెట్ల కోసం క్యూలలో నిలబడకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి, సెలవుల సమయంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి చాలా సమయాన్ని ఆదా చేయనుంది.
గతంలో ఒక్కో పర్యాటక ప్రాంతం దగ్గర విడివిడిగా ఎంట్రెన్స్ ఛార్జ్ వసూలు చేసేవారు. దీంతో టికెట్లు తీసుకునేందుకు వాహనాలు రోడ్లపై ఆగాల్సి వచ్చేది. ఈ సమస్యను తగ్గించేందుకు అధికారులు తర్వాత ఒకే చోట మాన్యువల్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ప్రధాన రహదారులపై రద్దీ కొనసాగింది. ఆ తర్వాత ఆన్సైట్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, కొండ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడంతో పేమెంట్స్ ఆలస్యమయ్యేవి. పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ కియోస్క్ లు ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో ట్రాఫిక్ సమస్య తగ్గలేదు.
ఈ సమస్యలకు పరిష్కారంగా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా అటవీ అధికారి కలిసి ముందస్తు ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని రూపొందించారు. పర్యాటకులు కోడైకనాల్కు బయలుదేరే ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఈజీగా పర్యాటక ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రహదారులపై వాహనాల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. కోడైకనాల్ పర్యటనను ప్రశాంతంగా ఆస్వాదించాలనుకునేవారు ప్రయాణానికి ముందే ఆన్లైన్ టికెట్ల వివరాలను తెలుసుకోవడం మంచిది.
Read Also: పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!