Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే వెయిటింగ్ లిస్టు టికెట్లు ఉన్న వాళ్లు ఇకపై స్లీపర్ కోచ్ లతో పాటు ఏసీ కోచ్ లలో ఎక్కకూడదనే నిబంధనను తీసుకొచ్చింది. మే 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనలు ప్రయాణీకులంతా పాటించాలని సూచించింది. పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. వెయిటింగ్ టికెట్ ఉన్నవాళ్లు జనరల్ కోచ్ లో ప్రయాణిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.
కొత్త రూల్ పై నెట్టింట పేలుతున్న మీమ్స్
వెయిటింగ్ లిస్టు టికెట్లతో స్లీపర్, ఏసీ కోచ్ లలోకి ఎక్కడ కూడదనే రైల్వే తాజా రూమ్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలో అన్ని ఆస్తులను పోగొట్టుకుని ‘నాకు నడక అలవాటే’ అనే డైలాగ్ తో మీమ్స్ క్రియేట్ చేసి జనాల్లోకి వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు ఈ రూల్ పై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. వెయిటింగ్ లిస్టు టికెట్లను కూడా కొంత మేరకు పరిమితం చేస్తే అందరికీ సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అనవసరంగా వెయటింగ్ లిస్టులో పెట్టి, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. రద్దీని బట్టి ఎంత వరకు బెర్త్ లు ఇవ్వగలుగుతారో, అంత వరకే ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. వెయిటింగ్ లిస్టు అనేది పెద్ద తలనొప్పి వ్యవహారం అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వెయిటింగ్ లిస్టు టికెట్లపై జోరుగా చర్చ జరుగుతోంది.
కొత్త రూల్ ఏం చెప్తుందంటే?
రిజర్వేషన్ కోచ్ లలోకి కన్ఫార్మ్ టికెట్ లేని ప్రయాణీకులు ఎక్కడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి వల్ల రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు రిజర్వేషన్ టికెట్ ఉన్నవాళ్లు, లేని వాళ్లకు మధ్య గొడవలు కూడా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ కోచ్ లలోకి ఇతర ప్రయాణీకులు రాకుండా చర్యలు తీసుకుంటున్నది భారతీయ రైల్వే. వెయిటింగ్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వే అధికారులు వెల్లడించారు. జరిమానా విధించడంతో పాటు నెక్ట్స్ స్టేషన్ లో డీబోర్డ్ చేయనున్నట్లు చెప్పారు. జరిమానా అనేది స్టార్టింగ్ స్టేషన్ నుంచి ట్రావెల్ పాయింట్ వరకు కనీస ఛార్జీతో పాటు ఆయా కోచ్ ను బట్టి మారుతూ ఉందన్నారు. ఒకవేళ ఏసీ కోచ్ లో ప్రయాణిస్తే టికెట్ ఛార్జీతో పాటు అదనంగా రూ. 440 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వెయిటింగ్ టికెట్లను కలిగి ఉన్న ప్రయాణీకులు సాధారణ కోచ్ లో ప్రయాణించే అవకాశం ఉందన్నారు. వెయిటింగ్ టికెట్లు ఉన్నవాళ్లు రైలు బయలుదేరడానికి కనీసం అరగంట ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారి టికెట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుందన్నారు.
Read Also: విశాఖ- విజయవాడ మధ్య విమాన సర్వీసులు.. ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?