ఆ దేశంలో ఒక్క విమానాశ్రయం కూడా లేదు.
విమానం ఎక్కాలంటే ఆ దేశవాసులు పొరుగు దేశం వెళ్లాలి.
కనీసం అధికార భాష కూడా లేదు.
జర్మనీని అరువు తెచ్చుకున్నారంతే.
అసలు వారికి సొంత కరెన్సీ కూడా లేదు.
లావాదేవీలకు స్విస్ ఫ్రాంక్ ని ఉపయోగించుకుంటారు.
ఇంత చెప్పాక ఇక ఆ దేశం గురించి మరింత తెలుసుకోడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. అదేదో నిరుపేద దేశం అని చిన్నచూపు చూస్తారు. కనీసం పర్యాటకం కోసం అయినా ఆ దేశం వెళ్లాలని ఎవరూ అనుకోరు. కానీ అది నిజం కాదు. ఆ దేశం చిన్నదే కానీ గొప్ప దేశం. ఆ దేశానికి సొంత భాష లేదు కానీ, అక్కడున్నవారంతా ధనవంతులు. సొంత కరెన్సీ లేదు కానీ, పక్క దేశం నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. సొంత విమానాశ్రయం లేదు కానీ సొంత విమానాలు కొనేంత ధనవంతులు ఆ దేశంలో ఉన్నారు. కొన్నా అది పెట్టుకోడానికి స్థలం లేదు కాబట్టి వారు కొనట్లేదంతే.
కేవలం 30వేల జనాభా గల ఆ దేశం పేరు లిక్టెన్ స్టైన్. ఐరోపా ఖండంలో ఉంది. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం ఇది. విమానాశ్రయం లేకపోయినా, సొంత కరెన్సీ లేకపోయినా, కనీసం అధికార భాష లేకపోయినా.. ఆ దేశం సుసంపన్న దేశం. అందరూ ధనవంతులే. ఉద్యోగాలు చేయకపోయినా జీవితాంతం దర్జాగా బతికేయగలిగిన స్థోమత ఆ దేశవాసులది. బ్రిటన్ రాజుకంటే ఈ దేశం సంపన్నమైనదని అంటారు.
నేరాలు లేవు..
ధనవంతుల దేశంలో నేరాలు జరగవు అంటే నమ్ముతారా? 30వేల జనాభా ఉన్న ఆ దేశంలో కేవలం 100మంది పోలీసులున్నారు. నేరాలు పూర్తిగా లేవు అని చెప్పలేం కానీ ఈ దేశంలో ఓ జైలు ఉంది. ఆ జైలులో కేవలం ఏడుగురు మాత్రమే ఖైదీలున్నారు. నేరాల రేటు చాలా తక్కువ. దొంగతనాలు దాదాపు జరగవని చెప్పాలి. ఆ దేశంలో ఎవరూ తలుపులకు తాళాలు వేసుకోరు అని అంటారు.
సురక్షిత దేశం..
భూమిపై అత్యంత ధనిక, సురక్షితమైన దేశాల్లో లిక్టెన్ స్టైన్ ఒకటి అంటారు. సహజ సౌందర్యం దీని సొంతం. దేశంలో మధ్యయుగానికి చెందిన గంభీరమైన కోటలు కనపడతాయి. మంచుతో కప్పబడిన ఆల్ప్స్ పర్వతాల శ్రేణి పర్యాటకుల్ని రారమ్మని ఆకర్షిస్తుంటుంది. పన్నుల భారం కూడా ఈ దేశవాసులపై చాలా తక్కువ. అంతేకాదు ఈ దేశం ఇతర దేశాలనుంచి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోదట. తాము సంపన్నులం అని చెప్పుకోడానికి కూడా ఆ దేశ వాసులు ఇష్టపడరట. ఇటీవల ఈ దేశం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు సర్కులేట్ అవుతున్నాయి. దీంతో అందరూ లిక్టెన్ స్టైన్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. కొంతమంది రిటైర్మెంట్ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడాలి అని కోరుకుంటున్నారు. మరికొందరు తమ దేశాలు కూడా అలా మారిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరికొందరు కనీసం ఆ దేశాన్ని ఒక్కసారయినా సందర్శించాలని అనుకుంటున్నారు. ఆ దేశాన్ని ఆల్రడీ చూసి వచ్చినవాళ్లు మాత్రం తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.