Electric Scooters With 70L Storage: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు చాలామంది రేంజ్, స్పీడ్, బ్యాటరీ సామర్థ్యం లాంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే, రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్ ఉపయోగించేవారికి స్టోరేజ్ కూడా చాలా ముఖ్యం. హెల్మెట్, బ్యాగ్, కిరాణా సామాగ్రి, రైన్ కోట్ లాంటి వస్తువులను తీసుకెళ్లడానికి బూట్ స్పేస్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ అందించే టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సింపుల్ ఎనర్జీ వేవ్ 70 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇంత పెద్ద స్థలం ఉండటంతో రెండు ఫుల్-ఫేస్ హెల్మెట్లు పెట్టుకోవడంతో పాటు గ్లోవ్స్, రెయిన్‌కోట్, షాపింగ్ బ్యాగ్‌లను కూడా ఉంచుకోవచ్చు. ముందు భాగంలో చిన్న వస్తువుల కోసం అదనపు స్టోరేజ్ స్లాట్‌లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు ఉంటుంది. టాప్ వేరియంట్ 243 కి.మీ. వరకు రేంజ్, 90 కి.మీ. గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
రివర్ ఇండి సీటు కింద 43 లీటర్ల స్టోరేజ్‌ను అందిస్తుంది. దీనికి అదనంగా 12 లీటర్ల ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ ఉంది. దీంతో మొత్తం స్టోరేజ్ 55 లీటర్ల వరకు ఉంటుంది. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, పానియర్ మౌంట్‌లు లాంటి అంశాలు కూడా అదనపు సామాను తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. దీని ధర రూ.1.52 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఉండగా, రేంజ్ 161 కి.మీ., టాప్ స్పీడ్ 90 కి.మీ ఉంటుంది.
లెక్ట్రిక్స్ ఎన్-డ్యూరోలో 42 లీటర్ల అండర్ సీట్ బూట్ స్పేస్ ఉంది. హెల్మెట్, ల్యాప్ టాప్ బ్యాగ్, రోజువారీ వస్తువులను ఉంచుకునేందుకు ఈ స్థలం ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్ ధర రూ.92,050 నుంచి రూ.1.05 లక్షల వరకు ఉంటుంది. 142 కి.మీ రేంజ్, 65 కి.మీ. గరిష్ట వేగంతో వస్తుంది.
బజాజ్ చేతక్ 35 సిరీస్ లో 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ లభిస్తుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ తో పాటు ఛార్జింగ్ కేబుల్, ఇతర చిన్న వస్తువులకు కూడా స్థలం ఉంటుంది. దీని ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.57 లక్షల వరకు ఉంది. వేరియంట్‌ను బట్టి 153 కి.మీ. వరకు రేంజ్, 70 కి.మీ గరిష్ట వేగం అందిస్తుంది.
ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఏథర్ రిజ్టాలో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. వెడల్పు ఉన్న బూట్ లో బ్యాగులు, హెల్మెట్ వంటి వస్తువులను పెట్టుకోవడం సులభంగా ఉంటుంది.అంతేకాకుండా, 22 లీటర్ల ఫ్రంక్ యాక్సెసరీని ఉపయోగిస్తే మొత్తం స్టోరేజ్ సామర్థ్యం 56 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. దీని ధర రూ.1.22 లక్షల నుంచి రూ.1.61 లక్షల వరకు ఉంటుంది. హైయర్ వేరియంట్‌లో 159 కి.మీ రేంజ్, 80 కి.మీ టాప్ స్పీడ్ లభిస్తుంది.
Read Also: ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!