A Village Inside an Active Volcano: అగ్నిపర్వతాలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కోసారి అగ్నిపర్వతం పేలితే బయటకు విరజిమ్మే లావా కిలో మీటర్ల కొద్దీ పారుతుంది. అది వెళ్లిన ప్రతి చోటు బూడిదైపోతుంది. అగ్నిపర్వతం సమీపంలో ఉండేందుకు ఎవరూ ప్రయత్నించరు. కానీ, అగ్నిపర్వతంలోనే ఓ గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మడం కాస్త కష్టం అయినా, ఇది ముమ్మాటికీ నిజం. జపాన్‌లోని అగోషిమా ద్వీపం అలాంటి అరుదైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. చుట్టూ సముద్రం.. మధ్యలో భారీ అగ్నిపర్వత గుంట.. దాని లోపల మరో చిన్న అగ్నిపర్వతం.. వాటి మధ్యలో ఇళ్లు. చూడటానికి ఈ ప్రాంతం సినిమా సెట్‌లా అనిపిస్తుంది.
అగోషిమా జపాన్ రాజధాని టోక్యోకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. టోక్యో మెట్రోపాలిటన్ పరిధిలోని ఇజు దీవుల సమూహంలో భాగం. టోక్యో నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసు ఉండదు. సాధారణంగా టోక్యో నుంచి హచిజోజిమా ద్వీపానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ లేదంటే పడవ ద్వారా అగోషిమాకు వెళ్లాలి. నిజానికి ఈ ద్వీపానికి చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు.
అగోషిమా ప్రత్యేకత అంతా దాని భౌగోళిక నిర్మాణంలోనే ఉంది. ఇది ఓ పెద్ద అగ్నిపర్వత క్రేటర్‌లో ఏర్పడిన ద్వీపం. దాని లోపల మరో చిన్న అగ్నిపర్వత నిర్మాణం ఉంది. ఈ ప్రత్యేక ఆకృతిని డబుల్ క్యాల్డెరాగా పిలుస్తారు. బయటి క్రేటర్ గోడలు సముద్ర మట్టానికి వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న చిన్న అగ్నిపర్వత శిఖరాన్ని మరుయుమా అంటారు. ఈ రెండు నిర్మాణాల మధ్యలోనే గ్రామం ఉంది.
ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నా, అక్కడ నివసించడానికి కొన్ని సహజమైన అనుకూలతలు ఉన్నాయి. ఎత్తైన క్రేటర్ గోడలు ఒక రకమైన సహజ రక్షణగా ఉండేవి. మరోవైపు సముద్రం కారణంగా చేపల వేటకు అవకాశం ఉండేది. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఏర్పడే నేలలో ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రకాల పంటలకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సో, ప్రకృతి సవాళ్ల మధ్యే అక్కడి ప్రజలు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఏర్పరుచుకున్నారు.
అగోషిమా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటి 1780లలో జరిగిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనం. ఈ విస్ఫోటనం తర్వాత ప్రాణనష్టం సంభవించడంతో పాటు, అక్కడి ప్రజల్లో చాలామంది ద్వీపాన్ని విడిచి వెళ్లిపోయారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రజలు ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. వందల్లోనే ఉండే చిన్న సమాజం ప్రకృతి మధ్య తమ జీవితాన్ని కొనసాగిస్తోంది.
అగోషిమాలో భూగర్భ వేడి కారణంగా కొన్ని ప్రాంతాల్లో నేల నుంచి ఆవిరి, వేడి నీరు బయటకు వస్తుంటాయి. స్థానికులు ఈ సహజ వేడిని వంటకు కూడా ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆవిరి ప్రాంతాల్లో ఆహారాన్ని వండుకుంటారు. ఇక్కడ సహజ వేడి నీటి బుగ్గలు కూడా ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
ఇదే ఈ ద్వీపం గురించి అందరికీ వచ్చే ప్రధాన ప్రశ్న. నిజానికి అగోషిమా అగ్నిపర్వతాన్ని జపాన్‌లోని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుంటారు. భూకంప కార్యకలాపాలు, అగ్నిపర్వతానికి సంబంధించిన మార్పులను గమనిస్తూ ప్రమాద పరిస్థితులను అంచనా వేస్తారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలను ద్వీపం నుంచి తరలించేందుకు హెలిప్యాడ్, సముద్ర మార్గాలను ఉపయోగించే ఏర్పాట్లు ఉన్నాయి. అంటే, ప్రమాదాన్ని పూర్తిగా విస్మరించి అక్కడి ప్రజలు జీవించడం కాదు.. ప్రకృతిని అర్థం చేసుకుంటూ, అవసరమైన జాగ్రత్తలతో అక్కడి జీవనం కొనసాగుతోంది. అగ్నిపర్వతం గుండెల్లోనే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న ఈ చిన్న ద్వీప ప్రజలు.. ప్రకృతితో మనిషి సహజీవనం ఎలా ఉంటుందో చూపించే అరుదైన ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నారు.
Read Also: ఇళ్లుంటాయి.. జనాలు ఉంటారు.. కానీ, అక్కడ ఊర్లకు పేర్లు ఉండవు, ఎందుకంటే?