Peruru Village History: ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి తోటలు, అందమైన కాలువలు, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు. అయితే, ఈ ప్రాంతంలో చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్రామం ఒకటి ఉంది. అదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పేరూరు. తమిళనాడు సంస్కృతితో విడదీయలేని అనుబంధం ఉన్న ఈ గ్రామాన్ని ‘పండితుల గ్రామం’ అని పిలుస్తారు.
అమలాపురం మండలానికి చెందిన పేరూరు గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. స్థానిక చారిత్రక కథనాల ప్రకారం, పదో శతాబ్దంలో చోళుల పాలన సమయంలో ఈ గ్రామం ఏర్పడినట్లు చెబుతారు. తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చిన వైదిక బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడ స్థిరపడటంతో గ్రామానికి ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు ఏర్పడింది. తమిళనాడు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు క్రమంగా ఇక్కడి జీవన విధానంలో భాగమయ్యాయి. అందుకే పేరూరు గ్రామాన్ని చూస్తే కోనసీమలో ఉన్నప్పటికీ తమిళనాడు సంస్కృతితో కళకళలాడుతుంది.
పేరూరు గ్రామానికి వెళ్లిన పర్యాటకులను ముందుగా ఆకట్టుకునేది అక్కడి పాతకాలపు ఇళ్లు. ముఖ్యంగా వందల ఏళ్ల నాటి సంప్రదాయ మండువా ఇళ్లు ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాలమైన వాకిళ్లు, చెక్కతో చేసిన అందమైన స్తంభాలు, పెంకుటి పైకప్పులు, మధ్యలో ఖాళీ ప్రదేశంతో నిర్మించిన ఈ ఇళ్లు అప్పటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడతాయి. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కనిపించే సంప్రదాయ గృహ నిర్మాణ శైలిని గుర్తుకు తెస్తాయి. ఆధునిక భవనాల మధ్య ఇలాంటి పురాతన ఇళ్లను చూడటం నిజంగా ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
పేరూరు గ్రామం కేవలం పాత ఇళ్లకే కాదు.. వేద విద్య, పౌరోహిత్య సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి. తరతరాలుగా ఇక్కడి కుటుంబాలు వేదాధ్యయనం, యజ్ఞయాగాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. అందుకే ఈ గ్రామానికి ‘పండితుల గ్రామం’ అనే పేరు స్థిరపడింది. నేటికీ ఇక్కడి జీవన విధానంలో పాతకాలపు ఆచారాలు, సంప్రదాయాల ప్రభావం కనిపిస్తుంది.
ఒకవైపు పురాతన చరిత్ర, మరోవైపు సంప్రదాయ నిర్మాణాలు, ఇంకోవైపు పచ్చని ప్రకృతి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు పేరూరు గ్రామంలో కనిపిస్తాయి. చుట్టూ కొబ్బరి తోటలు, నీటి కాలువలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి.
కోనసీమ అందాలను ఆస్వాదించాలనుకునే వారితో పాటు చరిత్ర, సంస్కృతి, పురాతన కట్టడాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాల్సిన గ్రామం పేరూరు. తమిళనాడు సంస్కృతి ఆనవాళ్లను ఆంధ్రప్రదేశ్‌లోనే చూడాలనుకుంటే ఈ పల్లె ఒక మంచి గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు.
Read Also: ఎండలు మండినా తరగని జలకళ.. దేవరకొండ కోటలో వింత కోనేరు!