B28 Bullet Train Update: భారత్‌లో స్వదేశీ బుల్లెట్ రైలు తయారీ పనులు మరో కీలక దశకు చేరుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా రూపొందిస్తున్న B28 హైస్పీడ్ రైలుకు తాజాగా స్క్వీజ్ టెస్ట్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు రైలు బోగీలు ఎంతటి ఒత్తిడిని తట్టుకోగలవో తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. అధిక వేగంతో ప్రయాణించే రైళ్ల భద్రతను నిర్ధారించడంలో ఇది చాలా ముఖ్యమైన పరీక్షగా చెప్పుకోవచ్చు.
రైలు ప్రమాదానికి గురైనప్పుడు బోగీలపై భారీ స్థాయిలో ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో రైలు బాడీ పూర్తిగా దెబ్బతినకుండా, ప్రయాణికులు ఉండే కంపార్ట్‌మెంట్ నిర్మాణం ఎంతవరకు సురక్షితంగా ఉంటుందో ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. బోగీ మీద బయటి నుంచి తీవ్ర ప్రభావం పడినప్పుడు ఆకారం మారుతుందా? నిర్మాణం దెబ్బతింటుందా? అనే అంశాలను పరిశీలిస్తారు. ఈ పరీక్షను బెంగళూరులోని BEML తయారీ కేంద్రంలో నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన BEML, ఒక్కో రైలులో ఎనిమిది కోచ్‌ల చొప్పున ఉండే మొదటి రెండు స్వదేశీ బుల్లెట్ రైళ్లను తయారు చేస్తోంది.
BEML టెండర్ పత్రాల ప్రకారం, B28 రైళ్లను గంటకు 249 కిలోమీటర్ల ఆపరేటింగ్ వేగంతో నడిచేలా రూపొందిస్తున్నారు. పరీక్షల సమయంలో గరిష్టంగా గంటకు 275 కిలోమీటర్ల వేగాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. స్క్వీజ్ టెస్ట్ విజయవంతంగా పూర్తయితే, ప్రోటోటైప్ రైలు తయారీ ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లే. ఒత్తిడికి గురైనప్పుడు రైలు బాడీ తన ఆకారాన్ని నిలుపుకోవడం, ప్రయాణికుల కంపార్ట్‌మెంట్ నిర్మాణం సురక్షితంగా ఉండటం ఈ పరీక్షలో కీలకమైన అంశాలు.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లోని సూరత్-వాపి మధ్య 100 కిలోమీటర్ల మార్గంలో 2027 మే లేదంటే జూన్ నాటికి B28 రైళ్ల ట్రయల్ రన్స్ ప్రారంభించాలని రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ మార్గంలో 2027 ఆగస్టు నుంచి కమర్షియల్ సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రైల్వేశాఖ తాజా ప్రకటన ప్రకారం, 2027 ఫస్ట్ క్వార్టర్ లో రెండు నమూనా రైళ్లు ట్రయల్ రన్స్ కు సిద్ధమయ్యే అవకాశం ఉంది. గుజరాత్ పరిధిలోని బుల్లెట్ రైలు మార్గాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక మొత్తం 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను 2030 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. స్వదేశీ టెక్నాలజీతో తయారవుతున్న B28 రైళ్లు విజయవంతమైతే, భారత హైస్పీడ్ రైలు రంగంలో కీలకమైన ముందడుగు పడనుంది.
Read Also: గంటకు 320 కిలో మీటర్ల వేగం.. సముద్రం కింద బుల్లెట్ రైలు ప్రయాణం!