Train coaches roll away: ఇంజిన్ లేకుండానే 6 కిలోమీటర్లు దూసుకెళ్లింది ఓ రైలు. ఏకంగా 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఈ ఘటన వెనుక ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. ఫలితంగా బెంగుళూరు-చెన్నై మధ్య పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట జంక్షన్ వద్ద ఏడు ఖాళీ రైల్వే కోచ్‌లు ఇంజిన్ లేకుండా ఆరు కిలోమీటర్లు ప్రయాణించాయి. చివరకు తమలేరి ముత్తూరు సమీపంలో ఖాళీ బోగీలు పట్టాలు తప్పాయి. ఖాళీ రైలు పట్టాలు తప్పిన క్రమంలో బెంగళూరు-చెన్నై మధ్య పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన గురించి తెలియగానే రైల్వే సిబ్బంది, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ట్రాక్‌పై రైళ్లు రాకుండా ముందు చర్యలు చేపట్టారు.
బెంగళూరు నుండి జోలార్‌పేట వైపు వస్తున్న పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిపివేయాలని సమీపంలోని రైల్వేస్టేషన్ సిబ్బందికి అధికారులు ఆదేశించారు. విధి నిర్వహణలోవున్న గేట్ కీపర్ పట్టాలు తప్పిన కోచ్‌లశబ్దాన్ని విని అధికారులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టాలుతప్పిన ఏడు ఖాళీ కోచ్‌లు మరమ్మతుల కోసం మెయింటెనెన్స్ యార్డులో ఉంచారు. యార్డులో ఆయా కోచ్‌లను ఓ ఇంజిన్ బలంగా ముందుకు నెట్టడంతో వాటంతట అవే వెళ్లడం మొదలైనట్టు సమాచారం.
పనుల్లో భాగంగా కోచ్‌ల అనుసంధాన భాగాలను వేరు చేయడానికి గ్యాస్-కటింగ్ పరికరాలను ఉపయోగించారు సిబ్బంది. వాటిని రైల్వే ట్రాక్‌ల నుండి దూరంగా నెట్టడానికి జేసీబీ యంత్రాలు ఉపయోగించారు. జోలార్‌పేట రైల్వే జంక్షన్ ముఖ్యమైన రైల్వే కేంద్రంగా ఉంది. ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే యార్డ్‌ను కలిగి ఉంది. ఈ సంఘటన జోలార్‌పేట రైల్వే యార్డ్‌లో భద్రతా విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థలపై , నిర్వహణ పనుల కోసం నిలిపి ఉంచిన కోచ్‌ల భద్రత విషయంలో పలు ప్రశ్నలను లేవనెత్తింది .
ALSO READ: వారణాసి-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. సోమవారం నుంచే రెగ్యులర్ సర్వీసులు!
ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. మొత్తానికి గేట్ కీపర్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే అస్సలు ఊహించులేమని అంటున్నారు రైల్వే సిబ్బంది.
#WATCH | Tirupattur district, Tamil Nadu: Seven empty railway coaches without an engine, which were reportedly left unattended at the railway yard of Jolarpettai Junction, rolled away and travelled nearly 6 kilometres before derailing on the main railway track near Thamaleri… pic.twitter.com/2fG4JxMwdv
— ANI (@ANI) November 2, 2026