EQ Railway Rules: రైల్వే ప్రయాణికులకు సంబంధించిన అత్యవసర కోటాలో (Emergency Quota – EQ) ఇప్పుడు కొత్త మార్పులు వచ్చాయి. రిజర్వేషన్ చార్టును రైలు బయలుదేరే సమయం కంటే 8 గంటల ముందే తయారు చేయాలన్న కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం నేపథ్యంలో ఈ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు ఎమర్జన్సీ కోటా కోసం చేసే అభ్యర్థనలు కూడా ఆ కొత్త సమయాలకు అనుగుణంగా ముందే పంపించాల్సి ఉంటుంది. ఆలస్యంగా పంపిన అభ్యర్థనలను ఇకపై పరిగణనలోకి తీసుకోరని మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది.
అర్థరాత్రి నుండి మధ్యాహ్నం వరకు బయలుదేరే రైళ్లు
రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో బయలుదేరే అన్ని రైళ్లకు సంబంధించిన EQ అభ్యర్థనలు, ప్రయాణానికి ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు EQ సెల్‌కి చేరాల్సి ఉంటుంది. అంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో బయలుదేరే రైళ్లకు టికెట్ కావాలంటే, దానికి ముందు రోజు మధ్యాహ్నం లోపే అప్లై చేయాలి.
మధ్యాహ్నం 2 తర్వాత బయలుదేరే రైళ్లు
మిగిలిన అన్ని రైళ్లకు, అంటే మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుండి అర్థరాత్రి వరకు బయలుదేరే రైళ్లకు సంబంధించిన EQ అభ్యర్థనలు ప్రయాణానికి ముందు రోజు సాయంత్రం 4 గంటల లోపు EQ సెల్‌కు చేరాలని స్పష్టం చేశారు.
ఆదివారాలు, సెలవు రోజుల్లో ప్రత్యేక సూచనలు
ఆదివారాలు లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో రైలు ప్రయాణం ఉంటే, EQ కోసం అప్లికేషన్ ఇవ్వాలంటే చివరి వారం పని దినంలోనే, ఆఫీసు సమయంలోపు అందజేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సోమవారం సెలవు ఉంటే, శనివారమే ఆ EQ అప్లికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సెలవు రోజుల్లో EQ సెల్ పని చేయదు.
అసలు క్లారిటీ ఇదే..
రైలు బోర్డు EQ సెల్‌కి రాజకీయ నాయకులు, రైల్వే అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారుల నుంచి పెద్ద సంఖ్యలో EQ అభ్యర్థనలు వస్తుంటాయని పేర్కొంది. అందువల్ల అందరికి న్యాయంగా కేటాయించేందుకు సమయానికి ముందే అభ్యర్థనలు పంపాలని కోరింది. ఆలస్యం జరిగితే చార్ట్ ప్రిపరేషన్ ఆలస్యమై, పౌరుల ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపింది.
EQ అభ్యర్థనలో నిజమైన అవసరం ఉండాలి
ఏ అభ్యర్థనైనా ముందుగా పంపిన వాటిలో వ్యక్తి వివరాలు, ప్రయాణ అవసరం నిజంగా ఉందా అనే విషయంలో ఆధారాలు ఉండాలి. ఇలా చేయడం ద్వారా అధికారుల భాద్యత కూడా ఉంటుంది. చట్టబద్ధమైన గైడ్‌లైన్ ప్రకారం, అర్హులకే EQ కేటాయించాల్సిందేనని మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది.
ప్రయాణికుల జాగ్రత్తలు
ఈ కొత్త మార్గదర్శకాలు ప్రతి ప్రయాణికుడు గమనించాలి. EQ అంటే అవసర సమయంలో అత్యవసరంగా టికెట్ పొందే అవకాశం అని మనం భావిస్తాం. కానీ ఇప్పుడు, ఆ అవకాశం కూడా క్రమబద్ధమైన సమయాల్లోనే లభిస్తుంది. కావున ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో EQ అవసరమైతే, ముందుగానే అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. EQ అనేది నిజంగా అవసరమైన వారికి సహాయపడే ఒక మంచి పద్ధతి. కానీ దీనిని సద్వినియోగం చేసేందుకు కొన్ని నియమాలు, సమయాలు ఉండటం అవసరం. నేటి మార్పులతో ఇకపై రైల్వే చార్ట్ సమయానికి తయారవుతుంది, ప్రయాణికులు ఇబ్బందికి గురికారు. రైళ్లు బయలుదేరడంలో ఆలస్యం ఉండదు. ఇది మొత్తంగా ఒక శుభ పరిణామంగా చూడవచ్చు.