Dharmapuri Arvind: పదునైన పదజాలంతో మాటల తూటాలు పేల్చే ఫైర్ బ్రాండ్ , నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సడన్‌గా సైలెంట్ అయ్యారు. విపక్షాలపై ఓ రేంజ్ లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే ఆయన కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. నోరు తెరిస్తే నిప్పులు చెరిగే అరవింద్, సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం సొంత అనుచరులకే మింగుడు పడటం లేదంట. ఎప్పుడు మీడియా ముందు, సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ, విలక్షణంగా మాట్లాడే అరవింద్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుకుండా కుట్ర జరిగిందని అరవింద్ భావిస్తున్నారా? అసలు ఆయనకు పదవి దక్కకుండా చక్రం తిప్పిన ఆ బలమైన నేతలెవరు?
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న అరవింద్
బీజేపీలో చేరిన నాటి నుంచి మొన్నమొన్నటి దాకా ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ… ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో కీలక పదవులు అనుభవించిన సీనియర్ నాయకుడు డీఎస్ కుమారుడు అయిన అరవింద్ అనతికాలం లోనే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆరవింద్‌ను ప్రచారానికి ప్రత్యేకంగా ఆహ్వానించారంటే ఆయన వాగ్దాటి, దూకుడు ఎలా ఉంటాయో అర్ధమవుతుంది.
ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా మాట్లాడే ధర్మపురి అరవింద్
అరవింత్ సెటైరికల్‌గా విసిరే మాటల తూటాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడే అరవింద్ సందర్భోచితంగా విమర్శలు చేయడంలో దిట్ట. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడంలో ఏమాత్రం తగ్గని అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అదే తరహాలో మాటల యుద్ధం కొనసాగిస్తూ వచ్చారు. తన తండ్రి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తుంటే.. అరవింద్ మాత్రం బీజేపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి ఫోకస్ అయిన అరవింద్
2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి రాష్ట్రం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసుకోగలిగారు. తొలిసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ఖాతాలో వేసి.. పార్టీలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుగోగలిగారు. అప్పటి నుంచి దూకుడు పెంచిన ఆయన రెండోసారి కూడా ఎంపీగా భారీ విజయం సాధించారు. రాష్ట్ర బీజేపీలో తిరుగులేని నేతగా నిలదొక్కుకున్నారు. హేమా హేమాహేమీలను వెనక్కి నెట్టి ముందు వరసలోకి చేరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల పసుపు ప్రత్యేక బోర్డు తీసుకొచ్చి, అమిత్ షా చేతుల మీదుగా ప్రత్యేక బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయించారు. అలా విరామం లేకుండా పనిచేసిన అరవింద్ ఒక్కసారి సైలెంట్ అవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోది. ఆయన మౌనం వెనుక కారణాలపై విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
అనతికాలంలో అత్యంత పాపులారిటీ సంపాదించిన లీడర్
రాష్ట్ర రాజకీయాల్లో అనతికాలంలో అత్యంత పాపులారిటీ సంపాదించిన లీడర్ అరవింద్ అని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నా సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టించే వారు. అలాంటి ఫైర్‌బ్రాండ్ దాదాపు మూడు వారాలుగా పత్తా లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు హాజరు కావడం లేదు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఆయన దానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. దానికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కక పోవడమే అంటున్నారు.
అరవింద్‌కు పార్టీ పగ్గాలు దక్కకుండా అడ్డుకున్న సీనియర్లు
బీజేపీలో ముందు నుంచి ఉన్న సీనియర్ నేతలు తనకు పార్టీ పదవి రాకుండా అడ్డుకున్నారని జరుగుతున్న ప్రచారంతో ఆరవింద్ ఆగ్రహంతో రగిలిపోతున్నారంట. రెండోసారి ఎంపీగా గెలుపొందిన అరవింద్ కేంద్ర మంత్రి పదవి ఆశించారు. చివరి నిమిషంలో బండి సంజయ్‌కు కేంద్ర క్యాబినెట్లో అవకాశం దక్కడంతో ఆయనకు నిరాశే మిగిలింది. ఇద్దరిదీ బీసీ, మున్నూరు కాపు సామాజిక వర్గం కావడంతో అరవింద్‌కు కాకుండా అధిష్టానం ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బండి సంజయ్ వైపు మొగ్గు చూపింది. ఆ విషయంలో అరవింద్ అంతగా కలత చెందకపోయినప్పటికీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారంట.
అరవింద్ లాంటి లీడర్ రాష్ట్ర అధ్యక్షుడి సరిపోతారని ప్రచారం
నూతన అధ్యక్షుడు రామచంద్రరావు పదవీ స్వీకారానికి కూడా అరవింద్ దూరంగా ఉండిపోయారు. ఆ తరుణంలోనే సోషల్ మీడియాలో అరవింద్ పెట్టిన పోస్టు తెగ వైరల్ అయింది. పర్సనల్ రీజన్స్ వల్ల రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నాను అని తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. నిజానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అరవింద్ లాంటి లీడర్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు సరిగ్గా సరిపోతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దూకుడు స్వభావంతో పాటు ఎలాంటి ఇష్యూపై అయినా అప్పటికప్పుడు స్పందించే గుణం ఆయనకు ఉంది.
అధ్యక్ష పదవి కోసం పోటి పడ్డ అరవింద్, ఈటల
బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. అందుకే ఆ వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్‌లు పార్టీ పగ్గాలు చేపట్టడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం రాష్ట్రంలోని పాత, కొత్త నేతల పంచాయతీలతో చివరకు రామచంద్రరావు పేరు ఖరారు చేశారు. దీంతో అరవింద్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ఆయన అనుచరవర్గం అంటోందంట. అధ్యక్ష పదవి అరవింద్‌కు దక్కాలని నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని బీజేపీ యువత కూడా ఆశించింది. సోషల్ మీడియాలో కూడా అరవింద్ ను సపోర్ట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారు.
Also Read: కన్న కూతురిపై సైకో తండ్రి దాడి..
పసుపు బోర్డు ప్రత్యేక కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అరవింద్ గత నెల 29న నిజామాబాద్ కు ఆహ్వానించారు. బహిరంగ సభను ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు స్వీకారం చుట్టారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమిత్ షా కార్యక్రమంలో ఎంపీ అరవింద్ ముభావంగా కనిపించారు. ఎప్పుడు ప్రతిపక్షాలపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేసే ఆయన.. అమిత్ షా ప్రోగ్రాంలో సాదాసీదాగా ప్రసంగాన్ని ముగించారు. మరుసటి రోజే రాష్ట్ర అధ్యక్షుని ప్రకటన వెలువడింది. ఈ విషయం అరవింద్‌కు ముందే తెలిసిపోవడంతో అమిత్ షా ప్రోగ్రాంలో నిరాశగా కనిపించారంటున్నారు. అధ్యక్ష పదవి దక్కకపోవడం పట్లై అరవింద్ తీవ్రనిరాశ చెందగా, అదేస్థాయిలో పార్టీ శ్రేణులు కూడా నారజ్ అవుతున్నాయంట. మరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అయినా అరవింద్ మునుపటి దూకుడు ప్రదర్శిస్తారా? లేక సైలెంట్ మోడ్ లోనే ఉంటారా? అన్నది చూడాలి.
Story By KLN, Bigtv