Sainagar Shirdi Express Train: జనవరి 1 నుంచి రైల్వే షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు రైల్వే సంస్థ ముందుగానే ప్రకటించింది. అయినప్పటికీ, ప్రయాణీకులు పాత షెడ్యూల్ ను ఫాలో కావడంతో పలు చోట్ల గందరగోళం తలెత్తుతున్నది. తాజాగా ఏపీలోని రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. రైలు షెడ్యూల్ లో మార్పుల కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సాయి నగర్ షిర్దీ ఎక్స్ ప్రెస్ ముందుగానే బయల్దేరింది. అయితే, ప్రయాణీకులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో సుమారు 3 గంటలపాటు ఆపాల్సి వచ్చింది.
గంట ముందుగానే బయల్దేరిన షిర్డీ ఎక్స్ ప్రెస్
జనవరి 1 నుంచి పలు రైళ్ల షెడ్యూల్ లో మార్పులు చేశారు రైల్వే అధికారులు. రైళ్లు బయల్దేరే సమయంతో పాటు ఆగే సమయాలను మార్చారు. అందులో భాగంగానే కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. తాజాగా షెడ్యూల్ ప్రకారం సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ సోమవారం ఉదయం 5 గంటలకే కాకినాడ నుంచి బయల్దేరింది. ఈ రైలు గతంలో ఉదయం 6 గంటలకు బయల్దేరేది. ప్రస్తుతం గంట ముందుగానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, షెడ్యూల్ లో మార్పులు తెలియని ప్రయాణీకులు రైలు ఎక్కలేకపోయారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో రైలు ఎక్కాల్సిన ప్రయాణికులు మిస్ అయ్యారు.
రైల్వే సిబ్బందితో ప్రయాణీకుల వాగ్వాదం
షిర్డీ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ గురించి తమకు తెలియదని ఆయా స్టేషన్లలో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రైల్వే అధికారులు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. రైలు మిస్ అయిన ప్రయాణీకులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే, ఈ రైలును రాజమహేంద్రవరంలో నిలిపివేశారు. అంతేకాదు.. కాకినాడ, సామర్లకోటలో రైలు ఎక్కలేకపోయిన ప్రయాణీకులను శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో రాజమహేంద్రవరానికి తీసుకొచ్చారు. అక్కడ సాయి నగర్ రైలు ఎక్కారు. మిస్ అయిన ప్రయాణీకులంతా రాజమహేంద్రవరంలో షిర్డీ ఎక్స్ ప్రెస్ ఎక్కిన తర్వాత రైలు అక్కడి నుంచి బయల్దేరింది. రైలు షెడ్యూల్ మార్పులను ప్రయాణీకులకు రైల్వే అధికారులు సరిగా అర్థం అయ్యేలా చెప్పడంలో విఫలం కావడం వల్లే ఈ గందరగోళం ఎదురైనట్లు అధికారులు ప్రయాణీకులు తెలిపారు.
జనవరి 1 నుంచి కొత్త షెడ్యూల్ అమలు
అటు ఇప్పటికే రైల్వే సంస్థ పలు రైళ్లకు సంబంధించిన షెడ్యూల్స్ లో కీలక మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆయా స్టేషన్లలో రైళ్లు బయల్దేరే సమయంతో పాటు, వచ్చే సమయాలకు సంబంధించి వివరాలను ఇప్పటికే డిస్ ప్లే చేస్తున్నారు. మరోవైపు షెడ్యూల్ మార్పులకు సంబంధించిన రైళ్లలో ప్రయాణించే ప్యాసెంజర్లకు ముందకుగానే రైల్వే అధికారులు సమాచారం అందిస్తున్నారు. షిర్డీ ఎక్స్ ప్రెస్ ప్యాసెంజర్లకు రైలు గంట ముందుగా బయల్దేరుతుందనే విషయం మెసేజ్ ల రూపంలో పంపినప్పటికీ, వాటిని ప్రయాణీకులు అర్థం చేసుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.
Read Also: 13 గంటల జర్నీ.. 5 గంటల్లోనే.. ఆ రూట్లో వందే భారత్ సరికొత్త రికార్డు!